వెలుగు ఓపెన్ పేజీ.. జానకమ్మా.. మీకు పాటాభివందనం

వెలుగు ఓపెన్ పేజీ.. జానకమ్మా.. మీకు పాటాభివందనం

జానకమ్మ పాటలను  నిజానికి  ఆలపించలేదు... పాటలే  పోటీలుపడి  మరీ ఆమె గళం నుంచి అలవోకగా  జాలువారాయి.  తాము తరించాయి.  మనల్నీ తరింపచేశాయి.  జానకమ్మతో  పనిచేసిన  సంగీత  దర్శకులంతా పుణ్యం చేసుకున్నారంటే  అతిశయోక్తి కాదు.  సంగీత దర్శకులు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని జానకమ్మ వందశాతం  నిలబెట్టుకున్నారు.   స్వరాలు ఏడు అంటారు. అయితే ఎనిమిదో స్వరం  జానకమ్మ అని చెప్పవచ్చు . అంతటి మాధుర్యం ఆమె గళంలో ఉంది.  ‘పద్మభూషణ్’ను 2013లో  ప్రకటించారు.  

అయితే,  సంగీత లోకానికి నేను చేసిన సేవ అంతకు మించింది అని జానకమ్మ  పద్మ పురస్కారాన్ని నిరాకరించారు.   కళాకారులు  ప్రాణంగా  భావించే ఆత్మగౌరవాన్ని  ఆమె  వదులుకోలేదు.  ఒక దశ మించాక తాను  ఇక పాటలు పాడనన్నారు.  జానకమ్మ   మీడియాతో  మాట్లాడిన కొన్ని సందర్భాల్లోనూ  ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు  అడిగినప్పుడు  మోములో చెరగని చిరునవ్వుతో జవాబిచ్చిన లబ్ధప్రతిష్ఠురాలు.  ఎంతో  అణకువను చాటారు.  

వేలాదిపాటలు  పాడటమే కాకుండా జానకమ్మ సంగీత దర్శకత్వం సైతం చేశారు.  శ్రోతలను సంగీతంతో మైమరిపించారు. పదహారేళ్లకు.. నీలో  నాలో  అనే పాట  మరో చరిత్ర  సినిమాను మలుపుతిప్పింది.  1978లో  విడుదలైన ఈ  సినిమాకు సాహిత్యం ఆత్రేయ అందిస్తే  సంగీతం ఎమ్.ఎస్. విశ్వనాథన్ అందించారు.  ఆకాశం ఏనాటిదో ఆవేశం ఆనాటిది.. ఈ పాట నిరీక్షణ సినిమా 1982లో  విడుదలైంది. కళాత్మక చిత్రాలకు ప్రతీకగా నిలిచింది. ఈ సినిమాలో జానకమ్మ కుమర్తె అర్చన తొలిసారి హీరోయిన్‌‌గా నటించడం విశేషం.  ఎన్నో మధుర గీతాలను మనకు వదిలి దివికి ఎగిరిపోయిన జానకమ్మకు సంగీతలోకం పాటాభివందనం చేస్తోంది.

దిలీప్ , మియాపూర్, హైదరాబాద్ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.