జమ్మూకశ్మీర్, వెలుగు: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఎమ్మెల్యేలకు రూ.20 - నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ బీజేపీ ప్రలోభపెడుతోందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అక్కడి బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఒమర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. పార్టీ ఇమేజ్ దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఎన్‌సీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించుకోవాలని చూస్తున్నారని చేసిన ప్రచారం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని బీజేపీ ఫైర్అయ్యింది. జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్‌పాల్ శర్మ ఆదేశాలతో సోమవారం అడ్వకేట్ ద్వారా ఒమర్ అబ్దుల్లాకు లీగల్ నోటీసు పంపించింది. వారం రోజుల్లోగా అబ్దుల్లా తన ఆరోపణలను వెనక్కి తీసుకుని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
