న్యూఢిల్లీ: వివిధ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షకుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. సుదీర్ఘ ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది.
ఇప్పటివరకు సోనమ్ వాంగ్‌చుక్ 8.2 కిలోల బరువు తగ్గారని సీజేపీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 67 ఎంజీ/డీఎల్ కు పడిపోగా, రక్తపోటు 107/70 ఎంఎంహెచ్‌జీగా నమోదైంది. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన సమస్య అని, ప్రభుత్వం తన తప్పును ఒప్పుకొని విద్యావ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడమే మెరుగైన మార్గమని హితవు పలికారు.
ఈ దీక్షా శిబిరాన్ని ఢిల్లీ మాజీ సీఎం అతీశి నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రతినిధి బృందం సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎం ఎంపీ అమ్రా రామ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపారు.
మరోవైపు ఐసా విద్యార్థి సంఘం నాయకులు కూడా ప్రత్యేక వేదికపై ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు భారీ శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు.
