అయోధ్య రామాలయంలో సీఈవో పోస్టు..దరఖాస్తులు ఆహ్వానించిన రామ జన్మభూమి ట్రస్ట్

అయోధ్య రామాలయంలో సీఈవో పోస్టు..దరఖాస్తులు ఆహ్వానించిన రామ జన్మభూమి ట్రస్ట్

అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారిగా ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (సీఈవో) పోస్టు భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు జులై 18 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పదవికి 50 నుంచి 70 ఏండ్ల మధ్య వయసు ఉండి, పెద్ద సంస్థల్లో కనీసం 20 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొంది. తప్పనిసరిగా హిందూ మతాచారాలను పాటించేవారై ఉండాలని తెలిపింది. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే రామభక్తులకు, దేవాలయాల నిర్వహణలో అనుభవం ఉన్న విశ్రాంత అధికారులకు ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ సీఈవో విధుల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టంచేశారు. ఆలయ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను కాపాడటం, భక్తులకు సదుపాయాలను పర్యవేక్షించడమే సీఈవో ప్రధాన విధి అని తెలిపారు. ఈయన నేరుగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.