హార్మూజ్‎లో UAE చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైళ్ల దాడి.. భారతీయుడు మృతి

హార్మూజ్‎లో UAE చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైళ్ల దాడి.. భారతీయుడు మృతి

టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దాడులను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ జలాల్లో తమ దేశానికి చెందిన మొంబాసా, అల్ బహియా అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ క్రూయిజ్ క్షిపణులు దాడి చేశాయని యూఏఈ తెలిపింది. మొంబాసా ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్ జాతీయులు ఉన్నట్లు తెలిపింది. 

మిస్సైల్ దాడుల కారణంగా రెండు ట్యాంకర్లలో మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లింది. ఈ దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన అని పేర్కొంది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. యూఏఈ సార్వభౌమత్వం, భద్రత, సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి దేశం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పింది. 

మా ఆదేశాలను పట్టించుకోలే: ఇరాన్

హార్మూజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి ఘటనపై ఇరాన్ వివరణ ఇచ్చింది. యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిలో తమ ఆదేశాలను పదే పదే ఉల్లంఘించడంతోనే దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. తమ బలగాల ఆదేశాలను ధిక్కరించి మైన్లు అమర్చిన మార్గం గుండా ప్రయాణించడానికి ప్రయత్నించాయని ఆరోపించింది. హోర్ముజ్ జలసంధిలో గుండా వెళ్లే చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఉపయోగించుకోవడానికి వాణిజ్య నౌకలను అమెరికా ప్రోత్సహిస్తోందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా మాట వింటే నష్టం తప్పదని ఈ సందర్భంగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.