స్వదేశానికి టూరిస్టుల డెడ్బాడీలు.. వియత్నాం నుంచి ముంబైకి 15 మృతదేహాలు

స్వదేశానికి టూరిస్టుల డెడ్బాడీలు.. వియత్నాం నుంచి ముంబైకి 15 మృతదేహాలు

హనోయి: వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో జరిగిన స్పీడ్‌‌‌‌‌‌‌‌బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది టూరిస్టుల డెడ్​బాడీలను సోమవారం భారతదేశానికి తరలించినట్టు హనోయిలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు వియత్నాం ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ విమానంలో హోచిమిన్ సిటీ నుంచి ముంబై ఎయిర్​పోర్ట్​కు మృతదేహాలను పంపించారు. 

డెడ్​బాడీలను ముంబై విమానాశ్రయం నుంచి మృతుల స్వస్థలాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకుంటున్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందిన వారు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు, ఇద్దరు కేరళకు చెందినవారు ఉన్నారు. కాగా, ఈ ఘటనలో సహాయం అందించిన వియత్నాం అధికారులందరికీ భారత రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. 

గత శుక్రవారం ఫు క్వాక్ ద్వీపం సమీపంలోని హాన్ మే రట్ న్గోయ్ వద్ద 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు స్థానిక సిబ్బందితో వెళ్తున్న స్పీడ్‌‌‌‌‌‌‌‌బోట్ అదుపుతప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన 16 మంది ఇండియన్​టూరిస్టులు ఇప్పటికే భారతదేశానికి తిరిగి రాగా, ఒకరు తీవ్ర గాయాలతో వియత్నాంలోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నారు. 

ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్​గా ఉన్నట్టు సమాచారం. నీటిలో మునిగిపోవడం వల్ల అతని ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మెదడులో రక్తస్రావంతో పాటు పలు గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతనికి హోచిమిన్ సిటీలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​అందిస్తున్నారు.