కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ అహంకారంతోనే సింగరేణికి కోల్ బ్లాక్లు రాలే..బీఆర్ఎస్ తీరు వల్లే సింగరేణికి ఈ దుస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ​సింగరేణిని అందినకాడికి దోచుకున్నయ్
  • సింగరేణి డబ్బులను సీఎం రేవంత్ ఫుట్​బాల్ ​మ్యాచ్​కు వాడుకున్నరు 
  • భవిష్యత్తులో అన్ని బొగ్గు గనులు సింగరేణికి వచ్చేలా చూస్తానని వెల్లడి  

భద్రాద్రికొత్తగూడెం/ మణుగూరు / జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కేసీఆర్ అహంకారం వల్లే సింగరేణికి కోల్​బ్లాకులు రాలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. గతంలో జెన్ కో కు క్యాప్టివ్​ మైన్​ కోల్​బ్లాక్​అప్పగిస్తే దాన్ని కేసీఆర్​ వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. మరో రెండు బ్లాక్ లకు వేలం నిర్వహిస్తే సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్​అడ్డుకున్నారని అన్నారు. ఒడిశాలోని నైనీ కోల్​బ్లాక్​ను కేంద్రం సింగరేణికి ఇచ్చిందని.. అప్పుడే పార్టీని బీఆర్ఎస్​గా మార్చుకున్న కేసీఆర్..​ ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ తో రాజకీయాలు మాట్లాడుకున్నారు గానీ.. నైనీ కోల్​బ్లాక్​ పర్మిషన్​గురించి అడగలేదని విమర్శించారు.

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైనీకి అవసరమైన పర్మిషన్స్ ఇప్పించామన్నారు. తెలంగాణ బిడ్డగా పలుమార్లు పీఎం మోదీని కలిసి సింగరేణి పరిస్థితి వివరించానని.. దీంతో న్యాయశాఖ అనుమతితో తాడిచర్ల 2 కోల్​ బ్లాక్​ను సింగరేణికి కేటాయించారన్నారు. సోమవారం బీజేపీ సింగరేణి భరోసా యాత్రను భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కిషన్​రెడ్డి ప్రారంభించారు.

ఈ యాత్ర మధ్యాహ్నం మణుగూరులోని ఓసీ 2 ప్రాజెక్టుకు చేరుకుంది. ఆయా చోట్ల జరిగిన మీటింగ్​లలో కిషన్​రెడ్డి మాట్లాడారు. సింగరేణిలో బొగ్గు మాయం అయిందంటూ హరీశ్​రావు, కేటీఆర్​ తనకు ఉత్తరాలు రాస్తున్నారని.. వాళ్లున్న పదేండ్లు సింగరేణిలో కేంద్రానికి వాటా ఉందన్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​సింగరేణిని ఎవరికి తోచినంత వాళ్లు దోచుకున్నారని ఆరోపించారు.

సింగరేణి నిధులను అప్పుడు సిద్దిపేటకు ఇప్పుడు కొడంగల్​కు తీసుకెళ్తున్నారన్నారు. సీఎం రేవంత్​రెడ్డి సింగరేణి డబ్బులు రూ.10 కోట్లు ఫుట్​బాల్​ మ్యాచ్​ పేర అప్పనంగా వాడుకున్నారన్నారు. గతంలో అప్పులై సింగరేణి ఖాయిలా పరిశ్రమగా ప్రకటించే సమయంలో వాజ్ పేయ్​రూ. 600 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని, ఈ రోజు కూడా బీజేపీ ప్రభుత్వమే సింగరేణికి అండగా నిలబడుతోందన్నారు. ఈ ప్రాంతంలోని గనులకు వేలం జరిగితే సింగరేణికే గనులు వచ్చేలా కృషి చేస్తానన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినయ్: రాంచందర్​రావు

బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు సింగరేణిని నష్టాల్లోకి నెడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి వైఫల్యం అన్నింటా కనపడుతోందన్నారు. అనంతరం డీకే అరుణ, ఏలేటి మహేశ్వర్​ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్​ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నేతలు గోనే మధుసూదన్​రెడ్డి, దేవకి వాసుదేవరావు, బైరెడ్డి ప్రభాకర్​ రెడ్డి, గల్లా సత్యనారాయణ, సూర్యనారాయణ పాల్గొన్నారు. 

సింగరేణి భవిష్యత్తు అంధకారానికి మొదటి దోషి కేసీఆర్

సింగరేణి భవిష్యత్తు అంధకారంలో ఉండడానికి సీఎం కేసీఆర్ మొదటి దోషి అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి భరోసా యాత్రలో  మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు సింగరేణి వెనక్కి వెళ్లిందన్నారు. దేశంలో సింగరేణి వన్​బిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేస్తుందని, దేశవ్యాప్తంగా బొగ్గు ద్వారా 73 శాతం కరెంటు తయారవుతుందన్నారు.

బొగ్గు ఉత్పత్తి ఆగితే కరెంటు, స్టీల్, ఇండస్ట్రీస్ ఆగిపోతాయన్నారు. తాడిచర్ల బ్లాక్ సింగరేణికే మణిహారంగా మారిందని దీని ద్వారా లక్షా ఇరవై వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, ధర్మారావు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, వెంకటేశ్ నేత, వెన్నంపల్లి పాపయ్య, ఎరుకల గణపతి  తదితరులు పాల్గొన్నారు.

భరోసా సభలో పాల్గొన్న సీపీఐ మేయర్​ 

కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో సీపీఐకి చెందిన కొత్తగూడెం మేయర్​ మూడ్​గణేశ్​ పాల్గొనడం చర్చానీయాంశంగా మారింది. కొత్తగూడెం క్లబ్​లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్​కు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరుతూ కిషన్​రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఇతర సంఘాల నాయకులు కూడా మంత్రికి వినతిపత్రాలు ఇచ్చి వెళ్లిపోగా.. గణేశ్ ​మాత్రం బీజేపీ నేతలతో కలిసి స్టేజీపై కొంత సేపు కూర్చున్నారు.