- వాణిజ్య నౌకల్లోని సరుకుపై 20% పన్ను వసూలు..నౌకల భద్రత కోసం
- ఛార్జీలు తప్పవన్న ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ జలసంధిపై పెత్తనం అమెరికాదేనని, ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకల రక్షణ బాధ్యత కూడా తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై తాము ఈ జలసంధికి ‘గార్డియన్ (రక్షక)’గా వ్యవహరిస్తామని చెప్పారు.
ఈమేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము హార్ముజ్ జలసంధిని కాపాడుకోబోతున్నాము, దాని భద్రతా వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకుంటాం. ఇందుకుగాను మాకు తగిన పరిహారం చెల్లించాల్సిందే’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే ప్రతి సరుకుపై 20% రుసుమును వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అదనపు ఛార్జీలు జలసంధి భద్రత కోసం అమెరికా సైన్యం చేస్తున్న ఖర్చులను భర్తీ చేయడానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఇరాన్ నౌకలపై కట్టడి
పన్ను వసూలు నిర్ణయం పూర్తిగా ఇరాన్లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నౌకలు లేదా ఇరాన్ వినియోగదారులకు సంబంధించిన నౌకలు ఈ జలసంధిలోకి ప్రవేశించకుండా లేదా బయటకు వెళ్లకుండా అమెరికా నౌకాదళం దిగ్బంధం చేస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల నౌకలు ఈ మార్గాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వాడుకోవచ్చని అమెరికా స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రతను కల్పించడం కోసం అమెరికా తన సైనిక వనరులను భారీగా కేటాయిస్తోందని, ఆ ఖర్చును వాణిజ్య సంస్థల నుంచే రాబట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతర్జాతీయంగా టెన్షన్
ఈ కీలక జలసంధిలో జరుగుతున్న పరిణామాలతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 4-5% వరకు పెరిగాయి. అమెరికా- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను మరింత అనిశ్చితిలోకి నెట్టింది. అంతర్జాతీయ సముద్రయాన చట్టాలకు భిన్నంగా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఐఆర్జీసీపై బ్రిటన్ నిషేధం
బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఇరాన్ సైనిక విభాగమైన ఐఆర్జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధం విధించింది. బ్రిటన్‌లోని యూదు సమాజంపై దాడులకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే కారణమని ఆరోపించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై చైనా ఆందోళన వ్యక్తంచేసింది. హార్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల భద్రతను కాపాడాలని పిలుపునిచ్చింది. కాగా, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చల కోసం నిర్దేశించిన 60 రోజుల గడువు సగానికి చేరింది.
ఈ తరుణంలో జరుగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ‘‘మళ్లీ పూర్తిస్థాయి శత్రుత్వం ముదిరితే అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది” అని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్‌లాంటి దేశాలు ఇరుపక్షాల మధ్య సీజ్‌ఫైర్‌ను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇరాన్ టాప్ దౌత్యవేత్తతో ఫోన్‌లో మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు.
ఇరాన్ రివేంజ్ లిస్ట్‌లో 13 మంది..
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని మెలోనీసహా హతమార్చాల్సిన 13 మంది ప్రపంచ రాజకీయ, సైనిక నాయకుల జాబితాను ఈ పత్రిక ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ పేర్లను ప్రముఖంగా చేర్చారు. వీరితోపాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్ మంత్రులు ఇజ్రాయెల్ కాట్జ్, గిడియాన్ సార్, ఐడీఎఫ్ చీఫ్ ఐయల్ జమీర్‌లాంటి సైనిక వ్యూహకర్తలను సైతం ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికాకు చెందిన మార్కో రూబియో, పీట్ హెగ్‌సెత్, సెంట్కామ్ కమాండర్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మైక్ హక్కబీను కూడా ఈ హిట్ లిస్ట్‌లో చేర్చడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులతోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను కూడా ఇరాన్ ఈ జాబితాలో చేర్చడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
