గోదావరిలో నీరు కనిపించగానే కాళేశ్వరం మోటార్లు నడపాలంటూ వినిపిస్తున్న వాదనలు వినడానికి ఇంపుగా.. సొంపుగానే ఉన్నాయి. కానీ నదీ ప్రవాహం కనిపించడం వేరు.. మోటార్లు నడిచేందుకు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు. రైతుల మాటల్లో చెప్పుకోవాలంటే.. బావిలో ఫుట్‌వాల్వ్ నీళ్లలో మునిగితేనే పంపు నీటిని ఎత్తిపోస్తుంది. నిజంగానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకపోతే రైతుల పంటలు ఎండిపోతాయా..? ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి తెలంగాణ అంధకారంలోకి వెళ్తుందా..? ప్రజలను భయపెట్టే రాజకీయ అతిశయోక్తి వెనుక ఉన్న అసలైన నిజాలేమిటో చూద్దాం.
కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్ 21న ప్రారంభమైంది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అంటే మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి రివర్స్ పంపింగ్ వ్యవస్థ పనిచేసింది నాలుగేళ్లు మాత్రమే. 2023 అక్టోబర్ నుంచి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ బంద్ అయింది. అయినా రైతుల అవసరాలేవీ నిలిచిపోలేదు. ఎందుకంటే.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా కాళేశ్వరం మీద ఆధారపడిన జలాశయం కాదు. గోదావరి నదిపై ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ దిగువన గోదావరి ప్రవాహంతో పాటు, అటు కడెం నుంచి వచ్చే వరద, ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు దాదాపు 10 వేల చదరపు కిలోమీటర్ల విస్తారమైన పరీవాహక ప్రాంతంలో కురిసే వర్షాలు దీనికి ప్రధాన ఆధారం. ఎల్లంపల్లికి దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని వెనక్కి ఎత్తిపోసే కాళేశ్వరం అదనం.
కన్నెపల్లి నుంచి సుందిళ్ల దాకా ఆయకట్టే లేదు
ఎల్లంపల్లి పూర్తి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. మొత్తం 62 రేడియల్ గేట్లు ఉన్నాయి. గత పన్నెండేళ్ల చరిత్రను పరిశీలిస్తే కాళేశ్వరం ఉన్నా లేకున్నా ఎల్లంపల్లికి వరద ప్రవాహాలు వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకు కనీసం 13 సందర్భాల్లో ఎల్లంపల్లి గేట్లు తెరిచారు. అంటే ఎల్లంపల్లి నిండాలంటే తప్పనిసరిగా కన్నెపల్లి మోటార్లు నడిపి నీటిని ఎత్తిపోయాలన్న ప్రచారం వాస్తవ చరిత్రకే విరుద్ధం. కన్నెపల్లి దగ్గర నీళ్లు నింపకపోతే పంటలు ఎండిపోతాయని చెప్పటం మరో అభూతకల్పన. ఎందుకంటే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల దశల కింద ప్రత్యక్ష ఆయకట్టు లేదు. ఇప్పటికిప్పుడు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే ఎక్కడి పంటలకు నేరుగా నీళ్లు అందుతాయో తెలంగాణ రైతులకు కూడా అంతుచిక్కని ప్రశ్న.
ఎన్‌టీపీసీ ఉత్పత్తి ఎన్నడూ ఆగలేదు
కన్నెపల్లి నుంచి నీరు ఎత్తకపోతే ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందా..? అది కూడా ఊహాజనితమే. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ నుంచి కూడా ఎన్‌టీపీసీకి అవసరమైన నీటిని లిఫ్ట్ చేసి నిల్వ చేసుకునే సదుపాయం ఉంది. 2023 నుంచి కాళేశ్వరం పంపులు నడవలేదు. మరి ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఒక్కరోజైనా ఆటంకం కలిగిందా..? అంటే అదీ లేదు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కూడా కొనసాగింది.
మేడిగడ్డ కుంగాక కూడా.. సాగు ఎలా పెరిగింది?
కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయం తగ్గిపోతుందా? 2023-24లో రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి 118.11 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2024-–25లో అది 127.04 లక్షల ఎకరాలకు, 2025-–26లో 129.80 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా వరి సాగు పెరిగింది. వరి విస్తీర్ణం పెరుగుదల మొత్తాన్ని కాళేశ్వరానికే ఆపాదించడం వితండవాదం. రాష్ట్రంలో పంటల సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, బోర్లు-, భూగర్భజలం, పాత సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, వర్షపాతం, మార్కెట్ ప్రోత్సాహకాలు వంటి ఎన్నో కారణాలున్నాయి. మూడేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తున్నదే లేదు. అయినా తెలంగాణలో సాగు మరింత పెరిగింది. కాబట్టి కాళేశ్వరం గత ప్రభుత్వానికి పొలిటికల్ మైలేజీకి పనిచేసినంతగా రైతుకు ఉపయోగపడలేకపోయిందని అర్థమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు మూడు బ్యారేజీల రిపేర్ తప్పక చేస్తుంది. అప్పటిదాకా ఆ ప్రాజెక్టును రాజకీయం చేయకుండా వాస్తవాలు మాట్లాడుకుంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు.
పారే నీటిని ఎత్తిపోయగలిగితే మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు?
సాంకేతికంగా చూస్తే మేడిగడ్డ వద్ద 93.5 మీటర్ల నీటిమట్టం ఉంటేనే 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు రన్ అవుతాయి. కానీ మేడిగడ్డ వద్ద నీటిమట్టం ఒకే తీరుగా ఉండదు. జులై 11న 89.90 మీటర్లు, జులై 13న 89.30 మీటర్లు నమోదైంది. అంటే పంపింగ్‌కు అవసరమైన స్థాయి కంటే మూడు నుంచి నాలుగు మీటర్లు తక్కువ. జులై 11న 63 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, జులై 13న 28 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాణహిత ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలను బట్టి మారుతుంది. అందుకే అక్కడ నీటిని నిల్వ చేయకుండా 18 కిలోమీటర్ల దూరంలోని పంపులను నిరంతరంగా నడపాలనుకోవటం వృథా ప్రయాస. స్వేచ్ఛగా పారుతున్న నీటినే ఎత్తిపోసుకునే వీలుంటే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అవసరమేముందని సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు.
బ్యారేజీలను ఆపరేట్ చేయడమే ప్రమాదకరం
కన్నెపల్లి నుంచి అన్ని పంపులు నిర్విరామంగా 24 గంటలు నడిస్తే రెండు నుంచి మూడు టీఎంసీల నీటిని పంప్ చేసే వీలుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ కన్నెపల్లి పంప్‌హౌస్ విధ్వంసమైన తర్వాత అక్కడ అన్ని పంపులు సమర్థంగా పనిచేస్తున్నాయా అన్నది ప్రశ్నార్థకమే. అక్కడి నుంచి నీటిని ఎత్తినా అన్నారంలో అవసరమైన పంపింగ్ స్థాయికి చేరటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేసి దశలవారీగా ఎత్తిపోస్తేనే ఎల్లంపల్లికి చేరుతుంది. ఆ మూడు బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ ప్రకటించింది. ఎన్‌డీఎస్‌ఏ లేదా కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా మూడు బ్యారేజీలను ఆపరేట్ చేయడం ప్రమాదకరం.
గేట్లు మూయకుండా పంపింగ్ ఎలా సాధ్యం?
ప్రాణహిత ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు కొంత పంపింగ్ సాంకేతికంగా సాధ్యమవుతుందేమో. కానీ ఆ ప్రవాహం ఎంతసేపు కొనసాగుతుంది? ఎత్తిపోసిన నీళ్లను అన్నారం, సుందిళ్ల గేట్లు మూయకుండా ఎలా నిల్వ చేస్తారో రిటైర్డ్ ఇంజినీర్లు సాంకేతికంగా వివరించాలి. మేడిగడ్డ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రిటైర్డ్ ఇంజినీర్లు ఇప్పుడు ఎన్డీఎస్ అనుమతులు లేకుండా నీటిని ఎత్తాలని ఎందుకు కోరుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
4 ఏళ్లలో163 టీఎంసీలు ఎత్తి..63 టీఎంసీలు మళ్లీ దిగువకు వదిలారు కాళేశ్వరం పనిచేసిన నాలుగేళ్లలో మేడిగడ్డ నుంచి 163 టీఎంసీల నీటిని ఎత్తారు. అందులో 63 టీఎంసీలను తిరిగి దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ మిడ్‌మానేరు, అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగి రైతుల బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడింది. ఈ పరిమిత ప్రయోజనాన్ని అంగీకరించాలి. అదే సమయంలో వేలాది కోట్ల ప్రజాధనం వెచ్చించిన ప్రాజెక్టులో నాలుగేళ్లకే మేడిగడ్డ కుంగిపోయిన వైఫల్యాన్ని విస్మరించలేం. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు కాళేశ్వరం క్రెడిట్ చెప్పుకునే బీఆర్ఎస్,
దాని వైఫల్యానికి సంబంధించిన బాధ్యతను కూడా స్వీకరించాలి.
- బొల్గం శ్రీనివాస్,సీఎం పీఆర్వో
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
