- ఎస్సీల సంక్షేమం, విద్యారంగంపై చర్చలు
- దళితుల అభ్యున్నతి కోసం చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రజా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా సోమవారం ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కుల వివక్షను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నామని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ స్కూళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యనందించే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసి, ఉచిత బ్రేక్ ఫాస్ట్, లంచ్, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వీటి సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తూ, రాజకీయాలతోపాటు అన్ని కీలక రంగాల్లో సముచిత స్థానం కల్పించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణను సైతం పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం వివరించారు.
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని చైర్మన్‌ను సీఎం కోరారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండేళ్లలో 60 వేల కేసులు పరిష్కరించాం
దేశవ్యాప్తంగా రెండేళ్ల కాలంలో 60 వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించామని, ఇది కమిషన్ చరిత్రలో రికార్డ్ అని నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ కవాడిగూడ సీజీజీ టవర్స్‌లో స్టేట్ ఎస్సీ కమిషన్ ఆఫీస్‌ను ప్రారంభించి మాట్లాడారు. అణగారిన వర్గాలకు న్యాయాన్ని అందించేందుకు, వారి హక్కులను పరరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఎన్‌సీఎస్‌సీ కార్యాలయాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలియజేశారు.
2024–2026 మధ్య కాలంలో అత్యుతమ పనితీరు కనబరిచిన శాఖల్లో తెలంగాణ ఎస్సీ కమిషన్ హైదరాబాద్ రీజియన్ ఒకటని డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు వెల్లడించారు. రెండేళ్లలో 10,853 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించిందన్నారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల చట్టంలోని నిబంధనల ప్రకారం బాధితులకు రూ.33.80 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామన్నారు.
