- ఇంజాపూర్‌లో 74 ఎకరాల ఆక్రమణపై సీఐడీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశం
- అధికారులే కబ్జాలకు సహకరిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్‌లో సర్వే నెం.126లో 74.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఆ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి సహకరించిన, బాధ్యులైన అధికారుల పాత్రపై దర్యాప్తు చేపట్టి, 3 నెలల్లో పూర్తి చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ భూమిని కాపాడడంలో విఫలమైన తహసీల్దార్, గ్రామ పాలనాధికారులపై విచారణ జరిపి మూడు నెలల్లో వారిపై చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఇంజాపూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, రికార్డుల మార్పిడి, అక్రమ లేఔట్‌లు, అధికార దుర్వినియోగం, రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు జరిపించాలని వినతిపత్రం అందజేసినా, చర్యలు తీసుకోకపోవడంతో సరూర్‌నగర్‌కు చెందిన న్యాయవాది సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సంతోష్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సర్వే నెం.126లో ప్రభుత్వ భూమిలో లేఔట్‌లు, రికార్డులు తారుమారు చేయడంతో పాటు రాజకీయ నాయకుల అండతో ఆక్రమణలు జరిగాయన్నారు. ఈ వాదనలతో పాటు ప్రభుత్వం తరఫున కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆక్షేపించారు. ఆక్రమణదారులకు అధికారులు అండగా నిలవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా అధికార యంత్రాంగం ఆక్రమణలకు సహకరిస్తోందన్నారు. కోర్టును చీకటిలో ఉంచి ఆక్రమణలకు సహకరిస్తుంటే కోర్టు కళ్లు మూసుకుని ప్రేక్షకపాత్ర పోషించదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కలెక్టర్ కౌంటర్ ప్రకారం సర్వే నెం.126లోని 74.16 ఎకరాలు సర్కారు భూమిగా, గ్రామ పటం ప్రకారం జిలావర్‌ఖాన్ చెరువుగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
1.1 ఎకరాల కాలువ మినహా మిగిలినదంతా ఆక్రమణలకు గురైనట్లు తేలిందన్నారు. యాపిల్ అవెన్యూ అపార్ట్‌మెంట్, 7.25 ఎకరాల్లో వ్యవసాయం, హుడాకు 22 ఎకరాలు, సబ్‌స్టేషన్, ఇందిరమ్మ ఇళ్లు, శ్మశానాలు, దేవాలయాలు, రోడ్లు ఇలా రకరకాల నిర్మాణాలున్నాయని వీటికి ఆ స్థలాన్ని ఎవరు కేటాయించారన్న వివరాలను కలెక్టర్ కౌంటర్‌లో ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు.
ఆక్రమణలు ఎలా జరిగాయి? వాటికి ఎవరు బాధ్యులు? వంటి వివరాలను అందించకుండా, అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా కౌంటర్ ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తే సరిపోదన్నారు. అధికారుల మౌనం యాదృచ్ఛికం కాదని, ఆక్రమణల కొనసాగింపునకు ఉద్దేశపూర్వకంగా సహకరించినట్లు స్పష్టమవుతోందన్నారు.
