డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలకు గుడ్ న్యూస్.. 2,784 మంది సిబ్బంది కొనసాగింపు

డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలకు గుడ్ న్యూస్.. 2,784 మంది సిబ్బంది కొనసాగింపు

  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 2,784 మంది సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. 451 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 349 మంది అవుట్‌‌సోర్సింగ్ సిబ్బందితో పాటు 1,984 మంది టీఎస్‌‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు, గెస్ట్ ఫ్యాకల్టీల సేవలను ప్రభుత్వం పొడిగించింది. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ఉన్నంత వరకు ఈ సిబ్బంది విధుల్లో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ విధుల్లో కొనసాగే వారికి సంబంధించిన రెమ్యూనరేషన్ (వేతనాన్ని) ఐఎఫ్ఎంఐఎస్ పద్ధతిలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే చెల్లించనున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా రిటైర్డ్ ఉద్యోగులను ఈ పోస్టుల్లో నియమించకూడదని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కాంట్రాక్టు వ్యవస్థ ఏర్పడ్డ గత 26 ఏండ్లలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంత త్వరగా కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కారు రెన్యూవల్ ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారి అని కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సంఘం కొనియాడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వైకుంఠం, మధుసూధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.