బీజేపీ ఇచ్చిన రిపోర్ట్‎ను పట్టుకొని కేసీఆర్‎ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్

బీజేపీ ఇచ్చిన రిపోర్ట్‎ను పట్టుకొని కేసీఆర్‎ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్

కరీంనగర్, వెలుగు: 'కాళేశ్వరం మీద ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్, ఏ పరీక్షలు చేయకుండా, నీళ్లలో అడుగుపెట్టకుండా 48 గంటల్లో రిపోర్టు ఎలా ఇచ్చారు' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే ఎన్డీఎస్ ఏ చైర్మన్ ఆధ్వర్యంలో పోలవరం కడితే అది మూడుసార్లు కొట్టుకుపోయిందని, సుంకిశాల కొట్టుకుపోయినా, గుజరాత్ లో ప్రాజెక్టులు కొట్టుకుపోయినా.. అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదన్నారు. బీజేపీ ఇచ్చిన రిపోర్టును పట్టుకొని కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 

మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇతర నేతలతో కలిసి సోమవారం కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం రోజుకు 9 టీఎంసీలు నీరు వృథాగా పోతుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికి సైతం కష్టాలు తప్పవని, ఎన్టీపీసీ, జైపూర్ పవర్ ప్లాంట్ కు నీళ్లివ్వకపోతే కరెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోయే ప్రమాదముందన్నారు. 

కన్నె పల్లి పంప్ హౌస్ ఆన్ చేయమని రిటైర్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీరు ఎత్తిపోయచ్చన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల వద్ద కాంగ్రెస్ వచ్చాకే గ్రౌటింగ్ చేశారని, అక్కడైనా నీళ్లు నింపవచ్చన్నారు. మూడుచోట్ల పంపులు ఆన్ చేస్తే.. మిడ్ మానేరు నుంచి అన్ని ప్రాజెక్టులకు నీళ్లు తరలించవచ్చని చెప్పారు. శ్రీపాద ఎల్లంపల్లిలో కూడా నీళ్లు లేవని, ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ కు తాగునీటి తిప్పలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. 

'మా రక్తం చల్లితేనే పంటలు పండుతాయని సీఎం అంటున్నారు.. అందుకే చాలా చోట్ల రక్తదానం చేశాం, మా అందరి రక్తం తీసుకొని రైతులకు మాత్రం నీళ్లివ్వాలి' అని డిమాండ్ చేశారు. తమ మీద కోపం రైతుల మీద చూపెట్టి పైశాచిక ఆనందం పొందొద్దని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఉన్నారు.