కరీంనగర్ టౌన్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మెర తిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు బండోజు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధర్నా చేసి, నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించలేదని, పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని, చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జయేందర్, రమణ, శ్రీనివాస్, సతీశ్, అరవింద్, సంపత్, రవీందర్, ప్రవీణ్ రెడ్డి, శాంతికుమార్, కుమార్ యాదవ్ శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
