భారతదేశంలో ఒక విచిత్రమైన భౌగోళిక వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు దేశంలోని ప్రధాన నగరాలు భారీ వర్షాలు, వరదలతో మునిగిపోతుంటే, మరోవైపు దేశానికి అన్నం పెట్టే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు మాత్రం సమయానికి తగినంత వర్షపాతం లేక వెలవెలబోతున్నాయి. జూన్ నెలలో తొలకరి వర్షాలు ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడంతో దేశవ్యాప్తంగా వర్షాకాలపు పంటల సాగు అగమ్యగోచరంగా ప్రారంభమైంది. ఇప్పుడు అందరి దృష్టి జులై నెల కురిపించే వర్షాలపైనే నిలిచింది.
ఆలస్యంగా, అస్థిరంగా కురుస్తున్న పవనాల వల్ల వరినాట్లు గణనీయంగా నెమ్మదించడమే కాకుండా, ప్రధాన ఆహార పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు దేశ వ్యవసాయ స్థితికి అద్దం పడుతున్నాయి. జులై ఐదో తేదీ నాటికి నమోదైన వర్షాకాలపు పంటల సాగు విస్తీర్ణం, గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా తొంభై ఒక్క లక్షల తొంభై ఐదు వేల హెక్టార్లు తక్కువగా ఉంది.
దేశంలో ప్రధాన ఆహారమైన వరిసాగు విస్తీర్ణం పడిపోయింది. అయితే ఈ ప్రతికూల మార్పు కేవలం వరి పంటకే పరిమితం కాలేదు, ఇతర వాణిజ్య, పప్పుధాన్యాల పంటలపైనా దీని తాకిడి తీవ్రంగా ఉంది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పది లక్షల హెక్టార్లకు పైగా తగ్గగా, తృణధాన్యాలు పదకొండు లక్షల హెక్టార్ల మేరకు తగ్గాయి. నూనెగింజల సాగు విస్తీర్ణం ఏకంగా నలభై రెండు లక్షల హెక్టార్లకు పైగా పడిపోవడం గమనార్హం. అటు పత్తి సాగు కూడా పద్దెనిమిది లక్షల హెక్టార్లకు పైగా తగ్గింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, అస్థిరమైన వర్షాలు దేశంలోని మొత్తం పంట చక్రాన్నే అస్థిరం చేశాయని స్పష్టమవుతోంది.
- వెంకగారి భూమయ్య
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
