వెలుగు ఓపెన్ పేజీ.. యూపీ ఎన్నికలు బీజేపీకి సవాలేనా?

వెలుగు ఓపెన్ పేజీ.. యూపీ ఎన్నికలు బీజేపీకి సవాలేనా?

2027లో  జరిగే  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికలలో  సునాయాసంగా  గెలుస్తామని  బీజేపీ  ధీమా వ్యక్తం చేస్తోంది.  వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిస్సందేహంగా యూపీలో బలమైన ఇమేజ్‌‌ను  ఏర్పరచుకున్నారు. అయితే,  ఉత్తరప్రదేశ్​ ఎన్నికలు ఎవరూ ఊహించని రీతిలో అనూహ్యంగా ఉంటాయి.  2024 లోక్‌‌సభ ఎన్నికలలో  ఉత్తర ప్రదేశ్‌‌లోని 80 పార్లమెంటరీ స్థానాలలో కనీసం 65 స్థానాలను  బీజేపీ  గెలుస్తుందని అంచనా వేసి ధీమా వ్యక్తం చేసింది.   కానీ,  దానికి  బదులుగా  బీజీపీ అంచనాలను తలకిందులు చేస్తూ  కేవలం 33 స్థానాలను  మాత్రమే  గెలుచుకుంది.  ప్రతిపక్షాలు పైచేయి సాధించడంతో  వారి చేతిలో అనూహ్య  ఓటమిని  చవిచూసింది.  ఆ షాక్ ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ,  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,  బీజేపీ  నాయకులను కుదిపేస్తోంది.  దేశంలో రాజకీయపరంగా ఉత్తరప్రదేశ్  చాలా పెద్ద రాష్ట్రం.


2022లో  జరిగిన  అసెంబ్లీ ఎన్నికలలో  మొత్తం 403  శాసనసభా స్థానాల్లో  బీజేపీ సారథ్యంలోని  కూటమి 273 స్థానాలను గెలుచుకోగా  ప్రతిపక్షం 125 స్థానాలను గెలుచుకుంది.  అయినప్పటికీ 2024 లోక్‌‌సభ ఎన్నికలలో మాత్రం  సమాజ్‌‌వాదీ పార్టీ  బీజేపీని అధిగమించి 37 ఎంపీలను గెలుచుకుంటే  బీజేపీ 33  సీట్లను  గెలుచుకుని  రెండోస్థానంలో నిలిచింది.  మరోవైపు  కాంగ్రెస్ 6 సీట్లతో తన బలాన్ని మెరుగుపరుచుకుంది. లోక్‌‌సభ ఎన్నికల్లో యూపీలో  ప్రతిపక్షాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి.  ఉత్తరప్రదేశ్‌‌లోని  ప్రధానంగా ఇద్దరు నాయకులు మధ్యనే పోరు జరగనుంది.  మూడోసారి  ముఖ్యమంత్రిగా  పోటీ చేస్తున్న ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ (54 ఏళ్లు), ఆయన ప్రధాన ప్రత్యర్థి అఖిలేష్ యాదవ్ (53),  ఉండగా రాహుల్ గాంధీ (56) కూడా యూపీలో ప్రభావం చూపగల  ప్రతిపక్ష నేత.  అయితే  వీరిలో ఎవరూ ఇప్పుడు యువ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోలేరు.  ఎందుకంటే.. ప్రజలు వారిని కొత్త ముఖాలుగా చూడటం లేదు.

బీజేపీకి  సవాళ్లు

బీజేపీకి అతిపెద్ద సవాలు ప్రతిపక్షం కాదు, అధికారంలో ఉన్నవారిపై  ప్రజల్లో ఉండే  ప్రభుత్వ వ్యతిరేకత.  ఉత్తరప్రదేశ్‌‌లో  పాలనాపరంగా గణనీయమైన అభివృద్ధి, 
శాంతిభద్రతల మెరుగుదల జరిగిందనడంలో సందేహం లేదు.  అయితే,  యోగి సారథ్యంలోని బీజేపీ సర్కారు అహంకారం, అతి విశ్వాసంపై  కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి.  అధికారంలో ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి.  జనవరి 2024లో ప్రారంభమైన  అయోధ్య రామమందిరం బీజేపీ సాధించిన గొప్ప రాజకీయ విజయాలలో ఒకటిగా నిలిచింది. 

అయినప్పటికీ,  దాని  ప్రారంభోత్సవం 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా కలిసి రాలేదు. పైగా,  ఫైజాబాద్ (అయోధ్య) పార్లమెంటరీ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది. ఈ స్థానంలో  ప్రతిపక్ష సమాజ్‌‌వాదీ పార్టీ గెలవడం గమనార్హం. అయోధ్య లో  బయటపడ్డ అక్రమాలు బీజేపీకి రాజకీయంగా ఎంతోకొంత నష్టపరుస్తాయా అనే ప్రశ్న ఉండనే ఉంది.  ప్రస్తుత  ప్రభుత్వ వ్యతిరేకతకు  అదనంగా, అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌‌లో  వివాదాలకు  దారితీస్తున్నాయి.  దీనివల్ల  ఎన్నికల ఫలితాలు ఎలా ప్రభావితమవుతాయో చెప్పలేం.  ఎమ్మెల్యేలపై  వ్యతిరేకత,  అధికారుల (బ్యూరోక్రసీ) అహంకారం  యోగీ సర్కార్‌‌‌‌కు మరొక  ఆందోళనకరమైన అంశం.  

మధుర వంటి  ఆలయ హామీలు విజయాన్ని  తెచ్చిపెడతాయా? 

ఇతర  పార్టీల నాయకులను చేర్చుకోవడం,  కొత్త  సామాజిక వర్గాలకు చేరువ కావడం ద్వారా బీజేపీ  సంప్రదాయబద్ధంగా  విస్తరించింది. 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌‌లో  ఆ ప్రక్రియ మందగించింది. తమ ప్రాబల్యానికి సవాలు విసిరే అవకాశం ఉన్న కొత్తవారిని  ప్రోత్సహించడానికి  పార్టీలో పాతుకుపోయిన  ప్రస్తుత నాయకులు వెనుకాడుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ ఆకట్టుకునే ఆర్థికవృద్ధిని నమోదు చేసినప్పటికీ,  అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాల  ప్రయోజనం చేకూరలేదు.  వ్యవసాయ రంగం ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా ఉంది.  రైతుల ఆదాయాన్ని పెంచడం,   గ్రామీణ ఉపాధిని కల్పించడం కోసం బీజేపీకి మరింత  స్పష్టమైన తగిన వ్యూహం చాలా  అవసరం.  మధుర వంటి  ఇతర ఆలయ అంశాలకు సంబంధించిన హామీలు విజయాన్ని  తెచ్చిపెడతాయా అనేది అనిశ్చితం. ఎందుకంటే  అయోధ్య  విషయంలో  బీజేపీ ఇప్పటికే  గరిష్ట రాజకీయ ప్రయోజనాన్ని పొందింది.  అయినా  ఆ స్థానంలో ఓటమిపాలైంది.  భవిష్యత్తు ఎన్నికలు.. పాలన, ఆర్థిక అంశాలపైనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది.

ప్రతిపక్షాల స్థితి

సమాజ్‌‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్  చాలా  త్వరగా  ప్రస్తుత రాజకీయ పరిణామాలను అంచనావేసి  విషయాలు నేర్చుకుంటారనడంలో సందేహం లేదు.  బిహార్‌‌లో  ఆర్జేడీ   నిరాశాజనకమైన  ప్రదర్శన తర్వాత, అగ్రవర్ణ ఓటర్లను  అనవసరంగా దూరంచేసే  దూకుడు వ్యూహాలకు,  కుల విభజనకు  దూరంగా ఉంటానని  అఖిలేశ్​ యాదవ్​ అన్నారు.  ఉత్తరప్రదేశ్‌‌లో  బీజేపీని 33 సీట్లకే  పరిమితం  చేసిన  తర్వాత  సమాజ్‌‌వాదీ పార్టీ ప్రాధాన్యం పెరిగింది.  2024  లోక్‌‌సభ  ఎన్నికలలో  అఖిలేశ్ యాదవ్  విజయం ఆయనకు కొత్త రాజకీయ ఊపునిచ్చింది.  

మోదీ కూడా వారణాసిలో చాలా తక్కువ మెజారిటీతో  గెలిచారు. ఈనేపథ్యంలో  అఖిలేశ్​ మైనారిటీలను  ఆకట్టుకోవడంపై  గణనీయంగా దృష్టి పెట్టారు.  ఈ వ్యూహాన్ని  బీజేపీ మైనారిటీల బుజ్జగింపుగా విమర్శిస్తోంది. ఈక్రమంలో అఖిలేశ్​ యాదవ్​ సారథ్యంలోని  సమాజ్‌‌వాదీ పార్టీ  హిందూ ఓటర్లలో తన ఆదరణను మరింత పెంచుకోవలసి ఉంటుంది.  లేకపోతే  అఖిలేశ్​ ఇంకా 20 ఏళ్లు వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. 

కాంగ్రెస్​ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో  కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను  మాత్రమే  గెలుచుకుంది. తమిళనాడులోలాగానే  కాంగ్రెస్ సొంతబలం లేక  పూర్తిగా  అఖిలేశ్ యాదవ్‌‌పైనే  ఆధారపడి ఉంది.  ఇండియా కూటమికి  తనవంతుగా  అదనంగా ఏమీ  జోడించడం లేదు. ప్రతిపక్షానికి  ప్రధాన సవాలు  ఏమిటంటే..  అభివృద్ధి,  శాంతిభద్రతల  విషయంలో  బీజేపీకి  బలమైన పేరు ఉంది.  అఖిలేశ్​  శాంతిభద్రతలను  సమర్థంగా కాపాడతానని ఓటర్లను ఒప్పించలేకపోతే 2024లో సాధించిన  పార్లమెంటు ఎన్నికల విజయాలను అసెంబ్లీ విజయంగా  మలచుకోవడం  కష్టమవుతుంది.

యోగి వర్సెస్ అఖిలేశ్​

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్  అత్యంత శక్తిమంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా ఎదిగారు. ఈ రాష్ట్రం  గణనీయమైన  మౌలిక సదుపాయాల అభివృద్ధిని,  పటిష్టమైన లా అండ్ ఆర్డర్‌‌‌‌ను చూసింది.  24 కోట్లకు పైగా  జనాభా  కలిగిన  ఉత్తర ప్రదేశ్  ప్రపంచంలోని  అనేక  దేశాల కంటే పెద్దది.  ఉత్తరప్రదేశ్‌‌లో  సుమారు 20% ముస్లిం జనాభా ఉంది.  చాలామంది  ఓటర్లు  గత  ప్రభుత్వాల  అస్థిరతను  ఇప్పటికీ  గుర్తుంచుకుంటారు. 2027లో  జరిగే  యూపీ  అసెంబ్లీ  ఎన్నికల్లో  ప్రధానమైన  కీలక  ప్రశ్న  ఏమిటంటే..  వారు యోగి  నాయకత్వంలో  కొనసాగింపును  కోరుకుంటున్నారా లేదా మార్పునకు  సిద్ధంగా ఉన్నారా అనేది.  సమాధానం కోసం  వేచిచూడాలి. 

నోయిడా శాపమా?

 2012 నుంచి 2017 మధ్య అఖిలేశ్​ యాదవ్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..  నోయిడాను సందర్శించిన ముఖ్యమంత్రి  అధికారాన్ని కోల్పోతారనే  మూఢనమ్మకం కారణంగా ఆయన నోయిడాను సందర్శించలేదు. దీనికి విరుద్ధంగా  2017లో  ముఖ్యమంత్రి  అయినప్పటి నుంచి  యోగి ఆదిత్యనాథ్
 25 సార్లుకంటే  ఎక్కువసార్లు నోయిడాను సీఎం హోదాలో  సందర్శించారు.  నోయిడా పర్యటన ‘బలమైన వ్యక్తి’గా ఆయన ప్రతిష్టను మరింత బలపరిచింది.  అఖిలేశ్​ యాదవ్  నిస్సందేహంగా  సమర్థుడైన రాజకీయ నాయకుడు. అయితే, ఆయన  సీఎం యోగి ఆదిత్యనాథ్,  ప్రధాని నరేంద్ర మోదీల ఉమ్మడి ప్రజాదరణను అధిగమించాల్సి ఉంటుంది.  

రాబోయే ఏడాదిలో నరేంద్ర మోదీ పనితీరుపై కూడా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి.  ద్రవ్యోల్బణం, ఉపాధి,  పన్నులు  కీలక అంశాలుగా  ఉంటాయి.  2027  ఎన్నికలపై   ఆర్థికవ్యవస్థ  గణనీయంగా  ప్రభావం చూపుతుంది. 2026 మేలో  బెంగాల్‌‌లో  బీజేపీ  చారిత్రాత్మక  విజయం సాధించింది.  కానీ 2029  పార్లమెంట్  ఎన్నికలలో  ఆత్మవిశ్వాసంతో  పోరాడాలంటే  మోదీ,  బీజేపీ  ఉత్తర ప్రదేశ్‌‌లో  గెలవాల్సి ఉంది.  ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలో  యూపీ  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  స్పష్టమైన  ఆందోళన నెలకొని ఉంది.  ఉత్తర ప్రదేశ్‌‌లో బీజేపీ ఓటమి చెందితే.. డీలిమిటేషన్,  ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు,  మహిళా బిల్లు వంటి అంశాలు 2029  ఎన్నికలకు  అసంబద్ధంగా మారాయని అర్థం.

- డా. పెంటపాటి పుల్లారావు, 
పొలిటికల్ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.