షరతులు పూర్తి చేశాకే విచారణ బనకచర్లను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిష న్ పై సుప్రీం క్లారిటీ

షరతులు పూర్తి చేశాకే విచారణ బనకచర్లను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిష న్ పై సుప్రీం క్లారిటీ
  • ఏపీకి ఇంజక్షన్ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థన నిరాకరణ
  • లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: సముద్రంలో కలిసే వృథా నీటి పేరుతో ఏపీ నిర్మిస్తోన్న పోలవరం –బనకచర్ల(నల్లమల్లసాగర్) ప్రాజెక్టును అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో అన్ని లోపాలు సరిదిద్దాకే ముందుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో కోర్టు పేర్కొన్న అవసరమైన అన్ని షరతులు పూర్తి చేయాలని సూచించింది. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలుపుదల చేసేలా ఇంజక్షన్ ఆర్డర్స్‌‌‌‌ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో తొలిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌‌‌‌లో  కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, ఒడిశా, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డులు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇలా మొత్తం 13 మందిని ప్రతివాదులుగా చేసింది. అయితే, ఈ రిట్ పిటిషన్‌‌‌‌లో పలు లోపాలున్నాయని పేర్కొంటూ ప్రాథమిక దశలోనే విచారణను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, దీనిపై ఒరిజినల్ సూట్ వేసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం రిట్ పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకున్నది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమంత్ నూకల మధ్యంతర పిటిషన్ (ఐఏ) దాఖలు చేశారు. ఈ ఐఏ (128697/2026 ) పై జస్టిస్ ఎన్వీ అంజరియ(ఛాంబర్ బెంచ్) బెంచ్‌‌‌‌ మే  22 న చాంబర్ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా రీ–ఫైలింగ్‌‌‌‌లో జరిగిన జాప్యాన్ని మన్నిస్తూనే, ఈ ఐఏను అనుమతించింది. దీని ఆధారంగా ఒరిజినల్ సూట్ (డైరీ నెంబర్ 18083/2026) ను కోర్టు వెకేషన్ తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒరిజినల్ సూట్ సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, గోపాల శంకర్ నారాయణ, తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.

రూల్ ఈజ్‌‌‌‌ రూల్..

తొలుత ధర్మాసనం జోక్యం చేసుకొని.. ఈ పిటిషన్‌‌‌‌ను జాబితా నుంచి తొలగించినట్టు వెల్లడించింది. ఈ సూట్‌‌‌‌కు సంబంధించి పలు ఫార్మాలిటీస్‌‌‌‌ను పిటిషనర్ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నది. అందువల్ల  ప్రస్తుతం కేసు విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. మధ్యలో తెలంగాణ తరపు అడ్వకేట్లు సింఘ్వీ, నారాయణ జోక్యం చేసుకొని.. గత ఆదేశాల్లో కేవలం నాలుగు లైన్ల ఉత్తర్వులు ఇచ్చారని, ఈ విషయంలో విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. మరోసారి జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. తాము కోర్టు రూల్స్ (నిబంధనల) ప్రకారమే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. శంకర్ నారాయణ అభ్యర్థిస్తూ..  మొత్తం 15 మందిని ప్రతివాదులుగా చేర్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈ విచారణ సందర్భంగా ..కేవలం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆ రాష్ట్రానికి మాత్రమే ఇంజక్షన్ ఆదేశాలు ఇవ్వాలని కోర్టుతున్నట్టు నివేదించారు. అయితే, ధర్మాసనం మాత్రం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘రూల్ ఈజ్‌‌‌‌ రూల్’ అని పేర్కొంటూ.. ఈ సూట్ విచారణపై నిబంధనల ప్రకారం రావాల్సిందే అని తేల్చి చెప్పారు.  అన్ని అవసరమైన షరతులను పూర్తి చేసిన తర్వాత ఈ పిటిషన్‌‌‌‌ను తిరిగి విచారణకు తీసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ పిటిషన్ మరోసారి ఈ నెల 27 న కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.