- ఖమ్మం జిల్లా అంజనాపురంలో దేశంలో తొలి ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్
- ఈనెలలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి ప్లాన్
- 113 ఎకరాల్లో సుమారు రూ.300 కోట్లతో నిర్మాణ పనులు
- రాష్ట్రంలో ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఇదే
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రాష్ట్రంలోని తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెలలోనే ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 113.5 ఎకరాల భూమిని కేటాయించగా, అక్కడ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు, నర్సరీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) సెంటర్, అధునాతన సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో సీడ్ గార్డెన్‌ను గుబ్బగుర్తిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న భూమికి అదనంగా మరో 35-40 ఎకరాలు కేటాయించాలని గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని, ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 22న సీఎం చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది.
గంటకు 15 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం..
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వేంసూరు మండలం కల్లూరుగూడెంలో రూ.250 కోట్లతో ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, గోద్రేజ్ అగ్రోవెట్ ఆధ్వర్యంలో గుబ్బగుర్తిలో మరో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయిల్ పామ్ మిల్లులతో పోలిస్తే పూర్తి ఆటోమేషన్‌తో ఇది రూపొందుతోంది. అత్యాధునిక క్రూడ్ పామ్ ఆయిల్ (సీపీఓ) మిల్ ప్రారంభ దశలో గంటకు 15 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుంది. రోజుకు 300 టన్నులు, నెలకు సుమారు 9 వేల టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసేలా దీన్ని రూపొందించారు.
భవిష్యత్తులో అవసరాన్ని బట్టి గంటకు 60 టన్నుల సామర్థ్యానికి విస్తరించేలా ప్లాంట్ నిర్మిస్తున్నారు. పూర్తి ఆటోమేషన్ వ్యవస్థతో ఒకే ఆపరేటర్ కంప్యూటర్ ఆధారంగా మొత్తం ప్లాంట్‌ను నిర్వహించగలుగుతాడు. ప్రాసెసింగ్ అనంతరం మిగిలే ఫైబర్, షెల్ వంటి ఉప ఉత్పత్తులను బాయిలర్లలో వినియోగించి ఆవిరి ఉత్పత్తి చేసి, టర్బైన్‌ల ద్వారా ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకునేలా ప్లాన్ చేశారు. దీంతో విద్యుత్ వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణహిత ఉత్పత్తి విధానం అమల్లోకి రానుంది.
రైతుల కోసం సొల్యూషన్ సెంటర్..
రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు గుబ్బగుర్తిలో ‘సమాధాన్ వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్’ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా మొక్కల పంపిణీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, ఎరువుల సరఫరా, సబ్సిడీ పథకాలపై మార్గదర్శకత్వం, రైతు శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సూచనలు అందిస్తున్నారు. ప్రతి రైతుకు ప్రత్యేక యూనిక్ కోడ్‌తో మొబైల్ యాప్ అనుసంధానం చేసి పంట పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు ప్రాంతాలు కలిపి మొత్తం 21 మండలాల రైతులకు సేవలు అందనున్నాయి. 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, ఈ నెల 20 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రాజెక్టులో నాలుగు ప్రధాన విభాగాలు..
నర్సరీ : నాణ్యమైన పామాయిల్ మొక్కలను పెంచి రైతులకు అందించడం.
సీపీవో మిల్ : అత్యాధునిక సాంకేతికతతో క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి.
ఆర్‌అండ్‌డీ కేంద్రం : విత్తనాలు, మొక్కలు, భూసారం, ఆయిల్ నాణ్యతపై పరిశోధనలు చేసి రైతులకు సాంకేతిక సలహాలు ఇవ్వడం.
సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ : విత్తనాల ప్రాసెసింగ్, నాణ్యత పరీక్షలు, మొక్కల తయారీని దేశంలోనే తొలిసారిగా ఒకే కేంద్రంలో నిర్వహించడం.
ఆయిల్ పామ్ విస్తరణకు మరింత అవకాశం..
గుబ్బగుర్తిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆయిల్ పామ్ విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి. రైతులకు దూరభారం కూడా తగ్గుతుంది. ఈనెలలోనే ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఉపయోగపడేలా సీడ్ గార్డెన్ ను దేశంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల విదేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునే భారం కూడా తగ్గుతుంది.
- తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
