- డిజిటల్‌తో పాటు మ్యానువల్‌గా వెంటనే అమల్లోకి తీసుకురావాలి
- భూముల వివరాలకు పకడ్బందీ ఆధారం అదే
- ప్రభుత్వానికి సూచిస్తూ రెవెన్యూ నిపుణుల నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల వివరాలు అటు ఇటు కాకుండా పక్కాగా ఉండాలంటే.. భూ యజమానుల హక్కులకు పూర్తి రక్షణ లభించాలంటే ప్రతి ఏటా ‘పహాణీ’ (గ్రామ లెక్కల రిజిస్టర్) రాయడం అత్యంత ఆవశ్యకమని రెవెన్యూ నిపుణులు తేల్చిచెప్పారు. గత పాలకుల హయాంలో తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగుదారుల వివరాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు రికార్డులకు ఎక్కడం లేదని, దీనివల్ల లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో భూపరిపాలనను ప్రక్షాళన చేసేందుకు, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా డిజిటల్ విధానంతో పాటు సంప్రదాయ మ్యానువల్ పహాణీలను కూడా తక్షణమే పునరుద్ధరించాలని రెవెన్యూ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. క్షేత్రస్థాయిలో పహాణీ పూర్తిగా కనుమరుగైపోవడం, కేవలం ఆన్‌లైన్ యాజమాన్య హక్కులకే పరిమితం కావడం వల్ల అనేక భూ వివాదాలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల క్రయవిక్రయాలు, వారసత్వ సంక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అన్యాక్రాంతమైన భూముల వివరాలు పక్కాగా తేలాలంటే పాత పద్ధతిలో ప్రతి ఏటా పహాణీ రికార్డులను నిర్వహించడం మినహా మరో మార్గం లేదని సూచించారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే సరిగ్గా 2014 నుంచే సాంప్రదాయ వార్షిక పహాణీల నమోదు ప్రక్రియ క్షేత్రస్థాయిలో క్రమంగా నిలిచిపోయింది. అంతకుముందు వరకు ప్రతి ఏటా గ్రామాధికారులు (పట్వారీలు, ఆ తర్వాతి కాలంలో వీఆర్వోలు) మే-–జూన్ మాసాల్లో ఏ సర్వే నంబర్‌లో ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంట వేశారు, బావులు లేదా బోర్ల పరిస్థితి ఏమిటనేది వివరంగా రాసేవారు. అయితే 2014 తర్వాత భూ రికార్డుల డిజిటలైజేషన్ (వెబ్ ల్యాండ్) ప్రక్రియ వేగవంతం కావడం, ఆపై ఎల్ఆర్‌యూపీ, ధరణి పోర్టల్ దిశగా అడుగులు పడటంతో ఈ ఏడాది క్షేత్రస్థాయి పహాణీలు రాయడం పూర్తిగా మూలనపడింది. దీంతో దాదాపు 12 ఏండ్లుగా భూమిపై యాజమాన్యం ఒకరి పేరున ఉంటే, వాస్తవంగా సాగు చేసుకుంటున్న కౌలు రైతులు లేదా కుటుంబ సభ్యుల సాగు వివరాలు రికార్డుల్లో లేకుండా పోయాయి. కేవలం ఆన్‌లైన్ రికార్డులనే నమ్ముకోవడంతో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు లేదా డేటా తారుమారైనప్పుడు రైతులకు తమ భూమిపై హక్కులను నిరూపించుకోవడానికి ప్రత్యామ్నాయ ఆధారాలు లేకుండా పోయాయి. ఈ పహాణీలను సుదీర్ఘకాలంగా ఆపివేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, భూ హక్కుల రక్షణ తీవ్రమైన గందరగోళంలో పడిపోయిందని, లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డుల గండం కొలిక్కి రావడం లేదని రెవెన్యూ నిపుణులు పేర్కొంటున్నారు.
భూ రికార్డులకు అదే ఆధారం
భూ పరిపాలనలో పహాణీ అనేది కేవలం ఒక కాగితం కాదు, అది భూమికి సంబంధించిన సమగ్రమైన ‘జాతకం’ లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా పహాణీని రాయడం వల్ల భూమి స్వభావం (ప్రభుత్వ భూమినా, అసైన్డ్ భూమి, దేవాదాయ పట్టా భూమి) స్పష్టంగా తెలుస్తుంది, అలాగే ఒక సర్వే నంబరులో ఉన్న భూమి అటు ఇటు కాకుండా రికార్డుల్లో పక్కాగా భద్రంగా ఉంటుంది. రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు లభించాలంటే పహాణీలు కూడా కీలమకం, పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ లేదా పరిహారం నేరుగా వాస్తవ సాగుదారునికి అందుతుంది. కోర్టుల్లో భూ వివాదాలు తలెత్తినప్పుడు దశాబ్దాలుగా ఉన్న పహాణీ నకళ్లను (నకలు కాపీలను) అత్యంత కీలకమైన సాక్ష్యంగా న్యాయస్థానాలు పరిగణిస్తాయి. డిజిటల్ రికార్డులకు హ్యాకింగ్ భయం లేదా సర్వర్ డౌన్ సమస్యలు ఉన్నప్పటికీ, మ్యానువల్ పహాణీ రిజిస్టర్ అందుబాటులో ఉంటే సామాన్య రైతు సైతం తన భూమి వివరాలను తనిఖీ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం భూ భారతిలో ఉన్న డిజిటల్ రికార్డులను భూముల క్రయ, విక్రయాల సందర్భంగా మారుస్తున్నారు. లింకు విషయానికొస్తే మాత్రం స్పష్టత ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే మ్యానువల్ భూముల రికార్డు నిర్వహణ తప్పనిసరి అని సూచిస్తున్నారు.
చట్టంలో చేర్చుకున్నాం.. వెంటనే అమల్లోకి తీసుకురావాలి
భూ భారతి చట్టం–2025’ ప్రకారం గ్రామస్థాయిలో భూ రికార్డుల తయారీ, నవీకరణకు చట్టబద్ధమైన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. గతంలో నిర్వీర్యమైన ‘పహాణీ’ (అడంగల్) రికార్డులను పునరుద్ధరించడమే కాకుండా, డిజిటల్ విధానంతో పాటు రాతపూర్వక మ్యానువల్ రికార్డులను కూడా సమాంతరంగా నిర్వహించాల్సి ఉంటుందని రెవెన్యూ నిపుణులు ప్రస్తావించారు. దానిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే గ్రామాల్లో గ్రామ పాలన అధికారులను నియమించినందున వారికి ఆ బాధ్యతను అప్పగించాలని పేర్కొన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 5 నిబంధనల ప్రకారం.. ప్రతి గ్రామంలోని సాగు భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలతో పాటు వాస్తవ క్షేత్రస్థాయి సాగు వివరాలను కూడా క్రమబద్ధంగా రికార్డులలో నమోదు చేయాలని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం వార్షిక ప్రాతిపదికన క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) జరిపి, పహాణీల్లోని వివరాలను నిరంతరం అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది, దీని ద్వారానే ప్రతి భూకమతానికి ఒక శాశ్వత ‘భూధార్’ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములపై తప్పుడు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారాన్ని సెక్షన్ 16 (నిబంధన 15) ద్వారా భూపరిపాలన ప్రధాన కమిషనర్ కు కట్టబెట్టారు.
