- దేశ వ్యాప్తంగా బీసీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
- బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీకే శివకుమార్ హామీ
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా ఓబీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. అదే విధంగా వచ్చే నెల 7న బెంగళూరులో జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభకు అటెండ్ కావాలన్నారు. సోమవారం బెంగళూరులోని కృష్ణ హౌస్‌లో సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజలు శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావులు కలిసారు. ఈ సమావేశంలో కర్నాటక పీసీసీ ప్రెసిడెంట్ బీకే హరిప్రసాద్, కర్నాటక బీసీ నేత లక్ష్మణ్, ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే (మహారాష్ట్ర)లతో పాటు సుమారు 15 మంది నేతలు సీఎంతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై సుమారు 20 నిమిషాలు బీసీ ప్రతినిధులతో సీఎం డీకే శివకుమార్ చర్చించారు. ముందుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం లెక్కించడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోతే ఓబీసీ మహిళలు చట్టసభలలో అడుగుపెట్టలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని ఆరోపించారు. 11వ జాతీయ ఓబీసీ మహాసభను ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నామని ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సీఎం డీకే శివకుమార్‌కు ఇన్విటేషన్‌ను అందజేసినట్లు జాజుల తెలిపారు.
బీసీలకు బాసటగా ఉంటా: సీఎం
దేశవ్యాప్తంగా బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం కర్నాటక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా తన వంతు కృషి చేస్తానని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరిగే జాతీయ ఓబీసీ మహాసభ ఈ సంవత్సరం మా రాష్ట్రంలో జరగడం అభినందనీయమని, తప్పకుండా మహాసభకు హాజరవుతానని హామీ ఇచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్, తెలంగాణ బీసీ నేతలు తదితరులు ఉన్నారు.
