దేశ వ్యాప్తంగా 5 కోట్ల నకిలీ మొబైల్ కనెక్షన్లు కట్

దేశ వ్యాప్తంగా  5 కోట్ల నకిలీ మొబైల్ కనెక్షన్లు కట్
  •     12 లక్షలకు పైగా పోగొట్టుకున్న, 
  •     చోరీకి గురైన మొబైల్స్ ​రికవరీ  
  •     టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖారే

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబర్ మోసాలు, టెలికాం సంబంధిత నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్) హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నత స్థాయి భద్రతా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. సదస్సుకు టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖారే, స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపా అరోరా, హైదరాబాద్ సీపీ సజ్జనార్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, సీఐడీ, డాట్ అధికారులు, ఆర్బీఐ, ఎస్‌‌బీఐ, టెలికాం సేవల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ ఖారే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను తొలగించామని, 12 లక్షలకు పైగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల నియంత్రణ కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెలికాం రంగంలో ఏఐ వినియోగంపై నివేదిక సమర్పించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు ‘ఫ్రాడ్ ఎనేబుల్డ్ నెట్‌‌వర్క్స్–ఘోస్ట్ సిమ్ నెట్‌‌వర్క్స్’ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.