కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు

కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు
  • భారీ అల బోటును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి

గండిపేట, వెలుగు: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్‌‌‌‌ టూరిస్టులు సోమవారం శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో వారు మాట్లాడారు. ‘‘బోటు ప్రయాణం ముగించుకొని, తీరానికి చేరుకునే సమయానికి అంతా బాగానే ఉందనుకున్నాం. కానీ ఒక్కసారిగా వచ్చిన ఒక భారీ అల బోటును బలంగా ఢీకొట్టడంతో సముద్రంలో బోల్తా పడింది. దీంతో సుమారు 20 మందికి పైగా టూరిస్టులు సముద్రంలో పడిపోయారు.

బోటు వెనుక భాగంలో కూర్చున్న వారు లోపలే చిక్కుకుపోయి బయటకు రాలేకపోయారు. ముందు భాగంలో ఉన్న మేము ఎలాగోలా ప్రాణాలతో బయటపడగలిగాం. ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే వియత్నాం రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి. నీటిలో మునిగి అపస్మారక స్థితికి చేరుకున్న పలువురు టూరిస్టులను తీరానికి తీసుకువచ్చి, సమయానికి సీపీఆర్ అందించడంతో కొంతమంది బతికారు.

స్థానిక అధికారులు, సిబ్బంది వేగంగా స్పందించకపోయి ఉంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేది”అని వారు తెలిపారు. కళ్ల ముందే తోటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంపై వియత్నాం ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు వారు వెల్లడించారు.