మెస్సీని కట్టడి చేస్తాం.. ఫైనల్‎కు వెళ్లేది ఇంగ్లండే: జో కోల్

మెస్సీని కట్టడి చేస్తాం.. ఫైనల్‎కు వెళ్లేది ఇంగ్లండే: జో కోల్

అట్లాంటా: ఫిఫా ప్రపంచకప్‌‌‌‌–2026 సెమీఫైనల్‌‌‌‌లో అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌‌‌‌కు ముందు ఇంగ్లండ్‌‌‌‌ మాజీ స్టార్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాలర్‌‌‌‌ జో కోల్‌‌‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జెంటీనా కెప్టెన్‌‌‌‌ లియోనెల్‌‌‌‌ మెస్సీని అడ్డుకుని ఫైనల్‌‌‌‌కు చేరేది ఇంగ్లండేనని ధీమా వ్యక్తం చేశాడు. 'ది రెస్ట్‌‌‌‌ ఈజ్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌' పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో మాట్లాడిన కోల్‌‌‌‌.. "మెస్సీని పూర్తిగా కట్టడి చేయాల్సి ఉంటుంది. అందుకు మా జట్టుకు కావాల్సిన సామర్థ్యం ఉంది. అతడిని అడ్డుకుని ఫైనల్‌‌‌‌కు చేరుతాం" అని చెప్పాడు. 

డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అర్జెంటీనాపై ఇంగ్లండ్‌‌‌‌ పైచేయి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక క్వార్టర్‌‌‌‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌‌‌‌పై మెస్సీ గోల్‌‌‌‌ చేయకపోయినా జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. మాక్‌‌‌‌ అలిస్టర్‌‌‌‌ చేసిన తొలి గోల్‌‌‌‌కు కార్నర్‌‌‌‌ ద్వారా అవకాశం కల్పించగా, అదనపు సమయంలో జూలియన్‌‌‌‌ అల్వారెజ్‌‌‌‌, లౌటారో మార్టినెజ్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో అర్జెంటీనా 3–1తో గెలిచి సెమీస్‌‌‌‌కు చేరింది. 

ప్రపంచకప్‌‌‌‌ చరిత్రలో ఇంగ్లండ్‌‌‌‌, అర్జెంటీనా జట్లు ఇప్పటికే ఐదుసార్లు తలపడ్డాయి. చివరిసారిగా 2002 ప్రపంచకప్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ విజయం సాధించింది. మరోవైపు ఇరు జట్లు కూడా క్వార్టర్‌‌‌‌ఫైనల్లో అదనపు సమయంలో గెలిచి సెమీస్‌‌‌‌కు చేరడంతో ఈ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.