న్యూఢిల్లీ: అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) డిఫెండింగ్ సూపర్ బౌల్ చాంపియన్ సియాటిల్ సీహాక్స్ జట్టును భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా కుటుంబం కొనుగోలు చేయనుంది. సుమారు 9.612 బిలియన్ డాలర్ల (రూ.80 వేల కోట్లకు పైగా) విలువైన ఒప్పందం కుదిరినట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఆగస్టులో జరిగే సమావేశంలో కొనుగోలు నిర్ణయం ఫైనల్ కానుంది. ఈ సందర్భంగా వినోద్ ఖోస్లా మాట్లాడుతూ.. పాల్ అలెన్ నిర్మించిన వారసత్వ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకుడైన ఆయన ఓపెన్‌ఏఐలో తొలి పెట్టుబడిదారుల్లో ఒకరు.
ఈ ఒప్పందం పూర్తయితే ఎన్‌ఎఫ్‌ఎల్ నిబంధనల ప్రకారం శాన్‌ఫ్రాన్సిస్కో జట్టులో ఉన్న తమ 3.1 శాతం వాటాను ఖోస్లా కుటుంబం విక్రయించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ 1997లో 194 మిలియన్ డాలర్లకు సీహాక్స్‌ను కొనుగోలు చేశారు. 2018లో ఆయన మరణం తర్వాత సోదరి జోడీ అలెన్ జట్టు యాజమాన్యాన్ని నిర్వహిస్తున్నారు. లూమెన్ ఫీల్డ్‌తో 2032 వరకు లీజ్ ఉండటంతో సీహాక్స్ సియాటిల్‌లోనే కొనసాగనుంది.
