బెల్లంపల్లి: ఓటు వేయలేదనే కక్షతో తాగునీటి సరఫరా నిలిపివేత...న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు

బెల్లంపల్లి: ఓటు వేయలేదనే కక్షతో తాగునీటి సరఫరా నిలిపివేత...న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కక్షతో తమకు తాగునీరు రాకుండా నిలిపివేశారని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ ఎస్సీ కాలనీ(10వ వార్డు) వాసులు కలెక్టర్ కుమార్​దీపక్​కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి సర్పంచ్​ఓరం కమల, ఉపసర్పంచ్​ వెంకటేశ్​ఆధ్వర్యంలో వెళ్లి కలెక్టర్​కు అర్జీ అందజేశారు. దశాబ్దకాలంగా వాడుకుంటున్న హ్యాండ్​ బోర్​కు ఏడు నెలల క్రితం ఓ వ్యక్తి మోటారు ఏర్పాటు చేసుకొని సొంత తోటకు వాడుకుంటున్నారని చెప్పారు. 

ఒక్కోసారి మిషన్​భగీరథ నీరు రాక తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్​వెంటనే మండల అధికారులకు, పోలీసులకు ఫోన్​ చేశారు. బోరు నుంచి ప్రైవేట్​వ్యక్తికి సంబంధించిన మోటారును తొలగించి పంచాయతీ మోటారు ఏర్పాటు చేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.