CSK హెడ్ కోచ్ బాధ్యతలకు స్టీఫెన్ ఫ్లెమింగ్ వీడ్కోలు

CSK హెడ్ కోచ్ బాధ్యతలకు స్టీఫెన్ ఫ్లెమింగ్ వీడ్కోలు

చెన్నై: ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్‎తో దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ముగింపు పలికాడు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌‌కే యాజమాన్యం సోమవారం ప్రకటించింది. 2008లో ఆటగాడిగా జట్టులో చేరిన ఫ్లెమింగ్, 2009 నుంచి హెడ్ కోచ్‌‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మార్గదర్శకత్వంలో సీఎస్‌‌కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. 

జట్టు రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్‌‌కు, 10 సార్లు ఫైనల్‌‌కు చేరింది. అయితే 2024, 2025, 2026 సీజన్లలో వరుసగా ప్లేఆఫ్‌‌కు అర్హత సాధించకపోవడంతో మార్పుపై చర్చలు జరిగాయి. సీఎస్‌‌కే యజమాని రూపా గురునాథ్, ఎండీ కేఎస్ విశ్వనాథన్ ఫ్లెమింగ్ సేవలను కొనియాడారు. తన కోచింగ్ కెరీర్‌‌లో సీఎస్‌‌కే ప్రయాణం అత్యంత గొప్పదని, ఆ జట్టు ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగానే ఉంటుందని ఫ్లెమింగ్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.