గిగ్ వ‌‌‌‌‌‌‌‌ర్కర్లకు ఏసీ గెస్ట్రూంలు..అమెజాన్ భాగస్వామ్యంతో ‘ఆశ్రయ్’ కేంద్రాలు

గిగ్ వ‌‌‌‌‌‌‌‌ర్కర్లకు ఏసీ గెస్ట్రూంలు..అమెజాన్ భాగస్వామ్యంతో ‘ఆశ్రయ్’ కేంద్రాలు
  • అమెజాన్ భాగస్వామ్యంతో ‘ఆశ్రయ్’ కేంద్రాలు 
  • వారి కష్టాన్ని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొర‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌
  • రద్దీ ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అమెజాన్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ -కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్ మహానగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఇరు పక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం చెప్పారు. అమెజాన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ‘ఆశ్రయ్’ కేంద్రాలు గిగ్ వర్కర్లు సేదతీరడానికి ఉపయోగపడతాయి. డిజిటల్ ఎకానమీని నడిపిస్తున్న వీరి వల్లే ఆధునిక జీవనం సజావుగా సాగుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ఆశ్రయ్ కేంద్రాల ఏర్పాటుతో హైదరాబాద్ మరింత మానవీయమైన మహానగరంగా మారుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన అమెజాన్ ఇండియాను  సీఎం అభినందించారు.

‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’  

అమెజాన్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ కింద ఈ విశ్రాంతి కేంద్రాలను నిర్మించనుంది. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కొండాపూర్, తెల్లాపూర్, పటాన్‌‌‌‌చెరు, భారతీనగర్, చందానగర్ ప్రాంతాల్లో ఎయిర్ కండీషన్డ్ (ఏసీ) విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల నిర్మాణం, నిర్వహణకు అయ్యే మొత్తం వ్యయాన్ని అమెజాన్ సంస్థే భరించనుంది. నగరంలోని ఏ డిజిటల్ వేదికకు చెందిన గిగ్ వర్కరైనా సరే.. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ సౌకర్యాలను వాడుకోవచ్చు.

ఈ కేంద్రాల్లో ఎయిర్ కండీషనింగ్‌‌‌‌,తాగునీరు, మరుగుదొడ్లు, మొబైల్ చార్జింగ్, ఉచిత వై-ఫై వంటి సౌకర్యాలు ఉంటాయి. ఎండ తీవ్రతతో పాటు ఫోన్లలో బ్యాటరీ అయిపోయి ఇబ్బందులు పడే తమకు ఈ కేంద్రాలు పని పరిస్థితులను మారుస్తాయని డెలివరీ డ్రైవర్ మహ్మద్ రఫీ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రీజన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 250 ఆశ్రయ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సలీమ్ మెమన్ తెలిపారు.