- 22న మహాకవి జయంతి వేడుకల్లో అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా అందజేసే ‘దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం-2026’ కోసం అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ఒక కమిటీని నియమిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ రచయిత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం నియమించింది.
జయరాజు (కవి), డాక్టర్ యాకూబ్ (కవి), సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (కవి, రచయిత), నెల్లూట్ల రమాదేవి (కవయిత్రి), ఈనుగు నరసింహారెడ్డి (భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు)ని సభ్యులుగా నియమించింది. అయితే, ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాహితీవేత్తల వివరాలను పరిశీలించి, అర్హులైన ఒకరి పేరును ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకల సందర్భంగా పురస్కార గ్రహీతకు ఈ అవార్డును అందజేస్తారు. ఈ పురస్కార ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
