సింగరేణి, జల వనరులను నిర్వీర్యం చేస్తున్నారు : బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర

సింగరేణి, జల వనరులను నిర్వీర్యం చేస్తున్నారు : బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను, రాష్ట్ర జల వనరులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్​ లీడర్​ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​విమర్శించారు. సోమవారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో వారు మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘సింగరేణి భరోసా యాత్ర’ ఒక డ్రామా అన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌‌లో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా అక్కడి నేతలు తమ ప్రాజెక్టును విమర్శించరని, కానీ తెలంగాణలో రూ.90 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

గుజరాత్ మైనింగ్ కార్పొరేషన్‌‌కు నామినేషన్ పద్ధతిలో కోల్ బ్లాకులు ఇస్తున్న కేంద్రం, సింగరేణికి అదేవిధంగా ఎందుకు కేటాయించడం లేదని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని రూ.3,200 కోట్ల లాభాలతో అప్పగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మళ్లించి రూ.4,300 కోట్ల ఓవర్‌‌డ్రాఫ్ట్‌‌కు తీసుకెళ్లిందని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిధిలోని గోలేటి, మదారం, కేకే ఓసీ (మందమర్రి), పూసపల్లి (ఇల్లందు), మణుగూరు ఓపెన్‌‌కాస్ట్ గనులకు పర్యావరణ అనుమతులు తీసుకురావాలని, ఇందుకోసం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.