రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి : గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి : గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేక‌ర‌ణ పూర్తయ్యిందని.. ఈ క్రమంలోనే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ అనుమ‌తి ఇప్పించాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, జూలై 14వ తేదీ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అనుమతులపై కేంద్ర మంత్రులతో వరసగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై చర్చించారాయన.

రీజనల్ రింగ్ రోడ్డు రెండు వైపులా ఒకే సారి పనులు ప్రారంభ‌మైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని.. నిర్మాణ తగ్గుతుందని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ నుంచి ఆంధ్రా రాజ‌ధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామ‌ని ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ ర‌హ‌దారికి అవసరం అయిన  అనుమ‌తులు వెంటనే ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్‌కు 12 వ‌రుస‌ల ర‌హ‌దారి మంజూరు చేస్తే.. హైద‌రాబాద్ -విజ‌య‌వాడ‌ మ‌ధ్య 100 కిలోమీట‌ర్లు త‌గ్గుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైద‌రాబాద్‌ సిటీ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంత‌మ‌వుతుంద‌ని స్పష్టం చేశారు సీఎం. . 

మన్ననూరు నుంచి శ్రీ‌శైలం వరకు ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అట‌వీ శాఖ అనుమ‌తులు ఇప్పించేందుకు కృషి చేయాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నల్లమల అభ‌యార‌ణ్యం, శ్రీ‌శైలం ఆల‌యం, శ్రీ‌శైలం జ‌లాశ‌యాలు ఈ కారిడార్ ప‌రిధిలో ఉంటాయ‌ని కేంద్ర మంత్రికి వివరించారారు సీఎం.

హైద‌రాబాద్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు ఉన్న రాజీవ్ ర‌హ‌దారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైద‌రాబాద్‌ వరకు ఆరు వ‌రుస‌ల జాతీయ ర‌హ‌దారికి అనుమ‌తులు మంజూరు చేయాల‌ని.. ఇందుకు కావాల్సిన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కొత్త రహదారి వల్ల వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వెల్లడించారాయన. 

ALSO READ : HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన సమావేశంలో న‌ల్గొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌, ప్రభుత్వ స‌ల‌హాదారు, ఎక్స్ అఫీషియో స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ కె.రామ‌కృష్ణారావు, స్పెష‌ల్ సెక్రటరీ కో ఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్‌ ఉన్నారు.