రెస్టారెంట్‌ లేదా హోటల్లో ఫుడ్ బాగోలేదా ? సైలెంట్‌గా ఉండకండి.. వెంటనే ఇలా కంప్లైంట్ చేయండి!

రెస్టారెంట్‌ లేదా హోటల్లో ఫుడ్ బాగోలేదా ? సైలెంట్‌గా ఉండకండి.. వెంటనే ఇలా కంప్లైంట్ చేయండి!

మనం హోటళ్లకు వెళ్లినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి పాడైపోయిన, కల్తీ ఆహారం రావడం చూస్తుంటాం. ఇలాంటప్పుడు కేవలం బాధపడి చూస్తూ ఊరుకోకుండా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తీసుకొచ్చిన 'ఫుడ్ సేఫ్టీ కనెక్ట్' (Food Safety Connect) మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ మధ్యకాలంలో  నాణ్యత లేని ఆహార పదార్థాలను పంపినందుకు  ప్రముఖ డెలివరీ యాప్ 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్' కు FSSAI నోటీసులు జారీ చేసింది. అలాగే లక్నోలో కల్తీ మసాలాల ఫ్యాక్టరీని మూసివేయించింది. తప్పుడు ప్రకటనలు ఇస్తున్న లోట్టే ఇండియా, హెరిటేజ్ ఫుడ్స్ వంటి పెద్ద కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చింది.

యాప్ ద్వారా వేటిపై ఫిర్యాదు చేయవచ్చంటే 
*హోటళ్లు లేదా దుకాణాల్లో అపరిశుభ్రత.
*కల్తీ ఆహారం లేదా గడువు ముగిసిన (Expired) వస్తువుల అమ్మకం.
*ప్యాకెట్లపై తప్పుడు సమాచారం ఇవ్వడం (ఉదాహరణకు: కల్తీ ఉన్నా 100% సహజమైనది అని బోర్డులు పెట్టడం).
*సదరు హోటల్‌కు అసలు FSSAI లైసెన్స్ ఉందో లేదో కూడా ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి?  
*ముందుగా మీ మొబైల్‌లో Google Play Store లేదా Apple App Store నుండి “Food Safety Connect" యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. (లేదా foscos.fssai.gov.in/consumergrievance వెబ్‌సైట్‌కి వెళ్లండి).
*యాప్‌లో మీ వివరాలతో రిజిస్టర్ అయ్యి, లాగిన్ అవ్వండి. అక్కడ 'కొత్త ఫిర్యాదు' (New Grievance) ఆప్షన్‌ను నొక్కండి.
* ఆ హోటల్ లేదా షాపు  పేరు, అడ్రస్ ఎంటర్ చేయండి. ఒకవేళ అక్కడ FSSAI లైసెన్స్ నంబర్ లేదా QR కోడ్ కనిపిస్తే దాన్ని స్కాన్ చేయండి.
*ఇప్పుడు మీకు ఎదురైన సమస్య ఏమిటో (కల్తీ, కుళ్లిపోయిన ఆహారం, అపరిశుభ్రత, తప్పుడు లేబుల్) అక్కడ సెలెక్ట్ చేసుకోండి.
* మీ సమస్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లేదా బిల్లుల వంటి ఆధారాలను అప్‌లోడ్ చేయండి.
* ఫిర్యాదును సబ్మిట్ చేయగానే మీకు ఒక 'ట్రాకింగ్ ఐడీ' (Tracking ID) వస్తుంది.
*ఆ ఐడీ ద్వారా మీ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ట్రాక్ చేయవచ్చు. ఈ ఫిర్యాదు నేరుగా ఆ ప్రాంత ఫుడ్ సేఫ్టీ అధికారులకు వెళ్తుంది.
*అధికారులు తీసుకున్న చర్యలపై మీకు నమ్మకం లేకపోతే, యాప్‌లోనే “Re-open” అనే ఆప్షన్ ద్వారా పై అధికారులకు సమస్యను తీసుకెళ్లవచ్చు.

ALSO READ : కొంత బెటర్ : ఎండలు తగ్గుతాయి.. అక్కడక్కడ వర్షాలు

సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే వెనకడుగు వేయకుండా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసి బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి.