మనలో చాలామందికి ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగనిదే రోజు గడవదు. ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారు డికాషన్ తీశాక, మిగిలిపోయిన కాఫీ పొడిని వ్యర్థంగా భావించి డస్ట్ బిన్‌లో పారేస్తుంటారు. కానీ ఆ వాడేసిన కాఫీ పొడితో మన ఇంట్లో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని మీకు తెలుసా ? ఈమధ్య చాలామంది వాడేసిన కాఫీ పొడిని చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారు. అసలు అలా ఎందుకు పెడతారు ? దానివల్ల జరిగే మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం !
ఫ్రిజ్‌లో కాఫీ పొడి పెట్టడం వల్ల ఉపయోగాలు
మనం ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, మిగిలిపోయిన కూరలు వంటి వాటిని పెట్టడం వల్ల కొన్నిసార్లు ఒకరకమైన బ్యాడ్ స్మెల్ (దుర్వాసన) వస్తుంటుంది.
అయితే కాఫీ పొడికి గాలిలోని చెడు వాసనలను పీల్చుకునే సహజ గుణం ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాసనను పోగొట్టి, ఫ్రిజ్ అంతటా మంచి సువాసన వచ్చేలా ఫ్రెష్‌గా చేస్తుంది.
ఫ్రిజ్‌లో కాఫీ పొడిని ఎలా వాడాలి?
కాఫీ డికాషన్ తీశాక మిగిలిన పొడిని ఒక ప్లేట్‌లో తడి లేకుండా వేసి బాగా ఆరబెట్టాలి. ఎండిన తర్వాత, ఒక 2 నుంచి 4 చెంచాల పొడిని మూత లేని చిన్న గిన్నె లేదా గాజు కప్పులో వేయాలి. ఈ గిన్నెను ఫ్రిజ్ మూలలో ఒక పక్కన పెట్టండి. ప్రతీ రెండు లేదా మూడు వారాలకు ఒకసారి ఈ పొడిని మార్చి కొత్తది పెడుతుండాలి. ఒకవేళ మీ దగ్గర వాడేసిన ఫిల్టర్ కాఫీ పొడి లేకపోతే, మామూలు ఇన్స్టంట్ కాఫీ పొడిని కూడా ఇలా వాడుకోవచ్చు.
వాడేసిన కాఫీ పొడితో ఇతర అద్భుత ఉపయోగాలు:
మొక్కలకు మంచి ఎరువు: వాడేసిన కాఫీ పొడిలో మొక్కలకు కావలసిన మంచి పోషకాలు ఉంటాయి. దీన్ని మొక్కల కుండీలలోని మట్టిలో కలిపితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
ALSO READ : సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారు.. ఎక్కడి నుంచి వస్తాయి..
జిడ్డు పాత్రలను తోమడానికి: కాఫీ పొడి కాస్త బరకగా ఉంటుంది. కాబట్టి వంట పాత్రలు, పెనం, గ్రిల్స్‌పై ఉండే గట్టి జిడ్డును వదిలించడానికి ఇదొక నాచురల్ స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.
డస్ట్‌బిన్ వాసన రాకుండా: చెత్త డబ్బా అడుగున కొద్దిగా పొడి కాఫీ పొడి చల్లితే, చెత్త వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
చీమలు రాకుండా: చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో, కిటికీలు లేదా తలుపుల దగ్గర కాఫీ పొడి చల్లితే చీమలు రాకుండా ఉంటాయి.
ఇకపై కాఫీ పొడిని వేస్ట్‌గా పారేయకుండా, ఇలా ఇంటి అవసరాల కోసం తెలివిగా ఉపయోగించుకోండి!
