తెలంగాణ భాష, యాస, పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చరిత్రకు, పల్లె జీవనానికి అద్దం పడతాయి. శతాబ్దాలుగా సాగిన వివిధ రాజరికాల పాలన, ముఖ్యంగా నిజాం పాలన ప్రభావంతో ఉర్దూ, పర్షియన్, మరాఠీ, కన్నడ పదాలు తెలుగులో సహజంగా కలిసిపోయి ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ భాష కేవలం మాట్లాడుకునే మాధ్యమం కాదు.. శ్రమజీవుల స్వేదం, మట్టి వాసన, ఆత్మీయత, జీవన అనుభవాల కలయిక.
తెలంగాణ పల్లెల్లో నిత్యం పలికే మాటలు, సుడికారాలు, సామెతలు, పొడుపుకథలు, జాతీయాలు ప్రజల కష్టసుఖాలను, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని చక్కగా పట్టిచూపుతాయి. ఇవి కేవలం పదాలు కావు. వాటి ఉచ్చార ణలోనే మన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి. జీవన విధానం దాగి ఉంటాయి. అందుకే తెలంగాణ పలుకుబడులు మన మట్టి పరిమళాన్ని, ప్రాంతీయ ప్రత్యేకతను మోసుకొచ్చే జీవభాషగా నిలిచాయి.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి అయిన సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించింది. కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతిని గుర్తుచేసే కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలో నిర్వహించారు.
ఉత్తమ కవులు, రచయితలను కాళోజీ పురస్కారాలతో సత్కరించారు. కాళోజీ సాహిత్య సేవలను తెలంగాణ మాండలిక గొప్పతనాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో గుర్తుచేసుకున్నారు. ఆయన చెప్పిన 'బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష కావాలి' అనేభావం తెలంగాణ జీవభాషకు ఉన్న ప్రత్యేకతను చాటుతుంది.
తెలంగాణ తెలుగు వ్యావహారికలో అచ్చమైన దేశీయ పదాలెన్నో ఉన్నాయి. ఉచ్ఛారణలోనూ ప్రత్యే కత కనిపిస్తుంది. మహాప్రాణ ధ్వనుల వాడకం తక్కు వగా ఉండటం క,చ,ట, త, ప వంటి అక్షరాలు కొన్ని సందర్భాల్లో గ, జ,డ,ద,బ లుగా పలకదం. శ-ష-సల మధ్య లేదా పెద్దగా కనిపించక పోవడం వంటి లక్షణా లు తెలంగాణ భాష నుడికారంలోకనిపిస్తాయి.
తెలంగాణ రాష్ట్రసాధనలోనూ భాష కీలక పాత్ర పోషించింది ఒకప్పుడు తెలంగాణ యాసలోమాట్లాడటానికే చాలామంది వెనుకాడిన పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో తెలంగాణ భాషనే ఉద్యమ భాషగా మార్చుకుని నీళ్లు, నిధులు, నియామకాలు' అనే ప్రధాన అంశాలతోపాటు తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి. భాషకు గుర్తింపు కోసం ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
తెలంగాణ పదాల్లో ఉన్న ఆర్థసంపదకు 'మేర'' అనే మాటేమంచి ఉదాహరణ. ఇతర ప్రాంతాల్లో దర్జీ అనే పదం వాడితే, తెలంగాణలో 'మేర' అంటారు. పొలిమేర'. 'ఆ మేరకు' ఈ మేరకు' వంటి పదాల్లోనూ 'మేరకు హద్దు అనే అర్ధం ఉంది. అలాగే సోయి.. సోయిలేదు... సోయిసుద్ధి ..పోయిసెప్పటం వంటి పదాలు అచ్చమైన తెలంగాణ నుడికారానికి ఉదాహరణలు.
నలిమెల భాస్కర్ రచించిన 'తెలంగాణ పదకోశం' తెలంగాణ పద సంపదను భద్రపరిచిన ముఖ్యమైన ప్రయత్నం. 'చల్ల' అంటే మజ్జిగ, 'ఎర్ర' అంటే వానపాము, 'లాగు' అంటే ప్యాంటు, 'అంగి' అంటే దేహాన్ని కప్పుకునే వస్త్రం, 'కంకి' అంటే కంకుతూ తినేది.. ఇలా ప్రజల నోట బతికున్న ఎన్నో పదాలను ఆయన పరిచయం చేశారు.
అదే బాటలో ప్రముఖ రచయిత డా. కాలువ మల్లయ్య రాసిన 'గుమ్మి' తెలంగాణ వాడుక భాష, పలుకుబడులు, సామెతలు, జాతీయాలు, మరుగున పడుతున్న పదజాలాన్ని అక్షరబద్ధం చేసింది. పల్లెల్లో ధాన్యాన్ని దాచుకునే పెద్ద బుట్టను 'గుమ్మి' అంటారు. పల్లె ప్రజల నోట ఉన్న అమూల్యమైన భాషా సంపదను దాచిన నిల్వ పాత్ర లాంటిదే ఈ పుస్తకం కాబట్టే ఆ పేరు పెట్టారు.
'ఆన గొట్టి ఎల్సినట్టు', 'సెర్లనీల్లు సెరెనుక వడ్డాయి', 'ఎరుకైందా!', 'ఎప్పటి సిప్ప ఎన్గుల్లే', 'తేనత్తకున్న గుడ్డత్త నయం', 'ఏందెల్వని ఎల్లపాయె గుర్గలేత్తే కరి గిపాయే', 'నాలుక తాటిమట్టా', 'మసిపూసి మారేడు కాయసేసుడు', 'కండ్లల్ల కారం గొట్టనట్టు', 'గజ్జెల గుర్రం', 'బసవన్న', 'కడ్డుగాడు', 'కన్నట్టు', 'కట్రౌతు', 'గత్కుడు', 'గల్మ', 'గూబ గుయ్యిమీన్నీది', 'సెంప సెల్లుమనుడు', 'సిల్కనుసెప్పినట్టు', 'సెప్పెల రాయి', 'సెవుల జోరీగ', 'కంటై నలుసు', 'జెన్కం', 'తొన్కం'. 'జప్పున', 'జలకం', 'ఈపు ఇమానమై మోగింది'.
'మెత్త', 'తంతె', 'మెట్టు'. ఇట్లాంటి పలుకుబడులుతెలంగాణ ప్రజల నిత్యజీవితంలో భాగమే.
'అటెనక' అంటే తర్వాత, 'సోయి' అంటే స్పృహ. ఇలాంటి పదాల్లో పాత తెలుగు రూపాలు, శబ్ద సౌందర్యం, భావ తీవ్రత ఇప్పటికీ బతికే ఉన్నయి. నిజాం పాలన, దక్కని సంస్కృతి ప్రభావంతో ఉర్దూ. హిందీ పదాలూ తెలంగాణ తెలుగులో జమిలిగా కలిసిపోయినయి. దవాఖానా-: ఆసుపత్రి, కిరాయి:--- అద్దె. జాగా: -స్థలం, అంగడి- :సంత, యాది:- జ్ఞాపకం, పెయ్యి: -శరీరం,పత్తా-: చిరునామా, సాలు-: సరిపో వడం, పానం: -ప్రాణం, పాశం;- పాయసం, వెతలు:- కష్టాలు, తెగువ :-ధైర్యం, చల్ల-: మజ్జిగ, బువ్వ- ... అన్నం...పోరి..చిన్నపిల్ల, పోరగాడు-...చిన్నపిల్లోడు, తిర్రి-.. పిచ్చి, మొకం- ..ముఖం, పయలం-: జాగ్రత్త.. వంటి పదాలు తెలంగాణ మాటలో కలిసిపోయిన తీరు భాషా వైవిధ్యా న్ని చూపుతుంది.
ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో హాస్యా నికి, విలన్ పాత్రలకు మాత్రమే పరిమితం చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులు, రచయి తలు, సాహిత్యకారులు తమ రచనల్లో తెలంగాణ భాషకు గౌరవం తీసుకొచ్చారు. టీవీ మాధ్యమాల్లో వీ6 'తీన్మార్ వార్తలు', ధూంధాం న్యూస్, మల్లన్న వార్తలు, పటాస్ వార్తలు వంటి కార్యక్రమాలు తెలంగాణ పలు
కుబడుల సొగసును ప్రజలకు చేరువ చేశాయి. సినిమాల్లోనూ ఫిదా, బలగం, మల్లేశం, లవ్ స్టోరీ, జాతిరత్నాలు, డీజే టిల్లు, దసరా, భగవంత్ కేసరి, ఒసేయ్ రాములమ్మ, చిల్లర దేవుళ్లు, మా భూమి, రుద్ర మదేవి, జై బోలో తెలంగాణ వంటి చిత్రాల్లో తెలంగాణ భాష, యాస, పలుకుబడులు బలంగా వినిపించాయి. అందుకే తెలంగాణ భాషను కేవలం ఒక యాసగా చూడటం సరికాదు. మన పల్లె బతుకు, మన మట్టి వాసన, మన చరిత్ర, మన సంస్కృతి, మనిషి మనసు కలిసిన జీవభాష ఇది. దినోత్సవాలు వచ్చి పోతుంటాయి.. కానీ మన నోట బతికే పలుకుబడులే తెలంగాణ భాషకు అసలైన ఊపిరి. వాటిని కాపాడు కుంటే మన మూలాలను కాపాడుకున్నట్టే.
-జాటావత్ రాజు, రచయిత
