ఉద్యోగం మారిన ప్రతిసారి పాత కంపెనీ PF డబ్బులను కొత్త కంపెనీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలామంది ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా ఉండేది. పాత కొత్త కంపెనీల అప్రూవల్స్, EPFOకి దరఖాస్తులు.. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి వారాలు కొన్నిసార్లు నెలలు పట్టేది. కానీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దిశగా EPFO కీలక మార్పు చేసింది.
కొత్త ఆటోమేటిక్ PF ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ప్రకారం.. ఉద్యోగం మారినంత మాత్రాన వెంటనే PF బ్యాలెన్స్ కొత్త ఖాతాకు బదిలీ కాదు. కొత్త కంపెనీ మీ UAN ఖాతాలో మొదటి PF కాంట్రిబ్యూషన్ జమ చేసిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే కొత్త ఉద్యోగంలో తొలి PF వాయిదా మెుత్తం జమ అయిన వెంటనే పాత PF ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ కొత్త కంపెనీ PF పాస్ పుస్తకంలోకి చేరుతుంది.
ఈ సదుపాయం పొందాలంటే ఉద్యోగి UAN ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే KYC వివరాలు పూర్తిగా అప్‌డేట్ అయి ఉండటం తప్పనిసరి. ఈ అర్హతలు ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా PF ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి అభ్యర్థిస్తేనే తప్ప.. సాధారణంగా ప్రక్రియ ఆటోమేటిక్‌గానే కొనసాగుతుంది. గతంలో ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు PF బదిలీ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. పాత, కొత్త యజమానుల ఆమోదాలు తీసుకోవాల్సి రావడంతో ఆలస్యాలు జరిగేవి. కొత్త విధానంతో ఒకే UAN కింద ఉద్యోగి కెరీర్ మొత్తం PF రికార్డు కొనసాగుతుంది. దీంతో పేపర్ వర్క్ తగ్గడంతో పాటు ఉద్యోగులకు సమయం ఆదా అవుతుంది.
ALSO READ : బ్రేకింగ్ న్యూస్: LICలో కీలక మార్పు..
PF అకౌంట్స్ సరిగ్గా లింక్ చేయబడి ఉంటే భవిష్యత్తులో PF అడ్వాన్స్, పెన్షన్ క్లెయిమ్, ఫైనల్ సెటిల్మెంట్ వంటి పనులు కూడా ఈజీగా పూర్తవుతాయి. ఉద్యోగులు EPFO మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి తమ సర్వీస్ హిస్టరీ, KYC వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మొత్తానికి కొత్త PF ఆటో ట్రాన్స్‌ఫర్ విధానం ఉద్యోగాలు మారే కోట్లాది మంది ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అనే చెప్పుకోవాలి. ఇకపై సరైన UAN, ఆధార్ లింక్, KYC ఉంటే PF డబ్బుల బదిలీ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తి కానుంది.
