Pakistan Cricket Board: విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే తమ దేశ ఆటగాళ్లకు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏకంగా 25,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 21 లక్షలు) వసూలు చేయాలని నిర్ణయించడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో పెను దుమారం రేపుతుంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీలు ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఆటగాడిని కొనుగోలు చేసినందుకు ఫ్రాంచైజీలే నేరుగా బోర్డుకు ఈ అదనపు రుసుము చెల్లించాల్సి రావడం పెద్ద చర్చకు దారి తీసింది.
పీసీబీ ఎందుకు డబ్బు అడుగుతోంది?:
ఈ వివాదాస్పద నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గట్టిగా సమర్థించుకుంటోంది. తమ దేశ ప్లేయర్స్ ఎంతో విలువైన వనరులని, వారు విదేశీ లీగ్‌లలో ఆడుతున్నప్పుడు ఆయా లీగ్‌ల ద్వారా పాక్ క్రికెట్‌కు కూడా ఆదాయం సమకూరాలని పీసీబీ పేర్కొంటుంది. తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, అలాగే దేశవాళీ ప్లేయర్ల కమర్షియల్ వాల్యూను ఈ ఫీజు ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పాకిస్థాన్‌లోని క్రికెట్ మౌలిక సదుపాయాల (Infrastructure) అభివృద్ధికి ఉపయోగిస్తామని పీసీబీ స్పష్టం చేసింది.
పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సపోర్ట్:
పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కూడా ఈ పాలసీని పూర్తిగా వెనకేసుకొస్తున్నారు. విదేశీ లీగ్‌లు పాకిస్థాన్ టాప్ క్రికెటర్ల భాగస్వామ్యం వల్ల భారీగా లబ్ధి పొందుతున్నాయని, అలాంటప్పుడు తమ ప్లేయర్లను పంపినందుకు బోర్డుకు తగిన పరిహారం లభించడం సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్రికెట్ బోర్డులు ఏవీ ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకపోయినా, పీసీబీ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
గందరగోళంలో MLC ఫ్రాంచైజీలు:
ఈ హఠాత్ పరిణామంతో మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. ఆటగాళ్లకు ఇచ్చే భారీ జీతంతో పాటు అదనంగా బోర్డుకు మరో $25,000 కట్టాల్సి రావడంతో బడ్జెట్ లెక్కలు తారుమారవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇతర క్రికెట్ బోర్డులు ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఉచితంగా ఎన్ఓసీలు జారీ చేస్తుంటే, పీసీబీ మాత్రమే ఇలాంటి నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అదనపు ఖర్చుల కారణంగా పాక్ ఆటగాళ్లతో జరుపుతున్న ఒప్పందాలు కూడా సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తుంది.
ప్రమాదంలో పాక్ ప్లేయర్ల కెరీర్:
ఈ కొత్త ఎన్ఓసీ పాలసీ వల్ల అంతిమంగా పాకిస్థాన్ ఆటగాళ్లే నష్టపోయే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లను ఎలాగోలా ఫ్రాంచైజీలు భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినప్పటికీ, అంతగా పేరు లేని ఇతర పాక్ ప్లేయర్స్ ని తీసుకోవడానికి లీగ్‌లు వెనకడుగు వేసే ఛాన్స్ ఉంది. అదనపు ఆర్థిక భారాన్ని మోయడం కంటే, ఎలాంటి ఛార్జీలు లేని ఇతర దేశాల ఆటగాళ్లను సెలక్ట్ చేసుకోవడమే ఉత్తమమని ఆయా ఫ్రాంచైజీలు భావించే అవకాశం ఉంది.
►ALSO READ | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఫస్ట్ బౌలింగ్ ఇండియాదే
అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చర్చ:
పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్స్ లభ్యత, జాతీయ బోర్డుల పెత్తనం, ప్రైవేట్ ఫ్రాంచైజీ లీగ్‌ల మధ్య ఉన్న సంబంధాలపై సరికొత్త చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, ఎన్ఓసీల పేరుతో బోర్డులు ఇలాంటి కఠిన నిబంధనలు విధిస్తే భవిష్యత్తులో ప్లేయర్స్ ఫ్రాంచైజీ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
