హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న ESI హాస్పిటల్ లో నూతన ఓపీడీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( జులై 14 ) కేంద్రమంత్రి మనసుఖ్ మాండవీయతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సనత్ నగర్ నుంచి దేశవ్యాప్తంగా 7 ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు కేంద్రమంత్రి మనసుఖ్ మాండవీయ.
అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మరో ఆరు ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, శాఖ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర మంత్రి. సుమారు రూ.668 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా 53 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆధునిక వైద్య సేవలు అందనున్నాయి.
►ALSO READ | తెలంగాణలో SIR గడువు పొడిగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి
సనత్‌నగర్‌లో 211.13 కోట్ల వ్యయంతో నూతన ఓపీడీ బ్లాక్‌ను నిర్మించారు. నూతన ఓపిడి బిల్డింగ్ లో ఆధునిక ఓపీడీలు, 180 సాధారణ పడకలు, 25 ఐసీయూ పడకలు, 20 ఎన్‌ఐసీయూ పడకలు, రేడియాలజీ, పునరావాసం, యోగా తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో 12.30 లక్షల మంది బీమా పొందిన కార్మికులు, లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. మా ఫాదర్ వెంకట స్వామి మంత్రిగా ఉన్నప్పుడు సనత్ నగర్ ఆస్పత్రికి వచ్చానని... ఇప్పుడు నేను లేబర్ మినిస్టర్ గా వచ్చి చూస్తే ఎంతో మార్పు కనిపిస్తోందని అన్నారు. ఇక్కడ బైపాస్ సర్జరీలు చేస్తున్నారని... డయాలసిస్ యూనిట్, లేటెస్ట్ క్యాన్సర్ థెరపీ సనత్ నగర్ ESI హాస్పిటల్ లో అందుబాటులో ఉందని అన్నారు.
సనత్ నగర్ కు రద్దీ అధికంగా ఉందని..టెర్షియరి హాస్పిటల్లు సనత్ నగర్ కు చుట్టు పక్కల ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్సీ పురం, పటాన్ చెరువు వంటి ఆస్పత్రుల మీద అధిక భారం ఉందని.. నాచారంలో 20పడకల డయాలసిస్ సెంటర్ అవసరం ఉందని అన్నారు. శంషాబాద్ లో ఆస్పత్రికి రాష్ట్రం ఇప్పటికే స్థలం ఇచ్చిందని.. 18 లక్షల మంది ఈఎస్ ఐ ఆస్పత్రుల్లో లబ్ధి పొందుతున్నారని అన్నారు.
73 డిస్పెన్సరీలు రాష్ట్రంలో ఉంటే స్థలం లేక 15 ఈఎస్ఐ డిస్పెన్సరీలు క్యాన్సిల్ చేశారని... వీటిని తిరిగి మంజూరు చెస్తే.. స్థలం ఇస్తామని అన్నారు మంత్రి వివేక్. హైదరాబాద్ తర్వాత రామగుండంలో ఎక్కువ మంది కార్మికులు ఉంటారని... సనత్ నగర్ లాగే... మిగతా ఆస్పత్రుల్లోనూ ట్రీట్మెంట్ అందాలని అన్నారు.
రామగుండం, శంషాబాద్, మహబూబ్ నగర్ లో ఆస్పత్రులు మంజూరు కాగా.. వరంగల్ లో మరొకటి మంజూరు చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు. డయాలసిస్ రోగులు పెరుగుతున్నారని... కార్డియాక్ తో పాటు డయాలసిస్ సెంటర్ లు సైతం అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తేవాలని అన్నారు మంత్రి వివేక్.
