స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీం ఆగ్రహం.. రూ.10 లక్షల జరిమానా !

 స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీం ఆగ్రహం.. రూ.10 లక్షల జరిమానా !

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో అనుచిత వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా కోర్టు ఎదుట తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారని, అలాగే కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ.. సుప్రీం కోర్టు మంగళవారం అతనికి రూ. 10 లక్షల జరిమానా విధించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం, రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని జమ చేయాలని అతనిని ఆదేశించింది. అలా చేయని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. "మీరు కోర్టును మోసం చేశారు" అని తీర్పునిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 

►ALSO READ | 40 నిమిషాల నరకం.. పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడిచిన యువకుడు

సమయ్ రైనా షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' ఫస్ట్ సీజన్‌లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివాదం తలెత్తిన కేసులో.. కంటెంట్ క్రియేటర్లు రణవీర్ అల్హాబాడియా, ఆశిష్ చంచ్లానీలతో పాటు క్యూర్ SMA ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయంపై వ్యాఖ్యలు చేసింది. 

కోర్టు ముందు హామీలు ఇచ్చినప్పటికీ, రైనా క్యూర్ SMA ఫౌండేషన్‌ను గానీ, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA)తో బాధపడుతున్న వ్యక్తులను గానీ సంప్రదించలేదని, సాయం అందించలేదని సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టుకు తెలియజేశారు.

SMA బాధితులపై సమయ్ రైనా వెకిలి వ్యాఖ్యలు:
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో.. SMAతో బాధపడుతున్న రెండు నెలల పసికందు వైద్యానికి నిధుల సేకరణపై కుళ్లు జోకులు వేశాడు. ఒక ఛారిటీ కేసును ప్రస్తావించాడు. ‘ఏదో వింత జరిగింది’.. రెండు నెలల పసికందుకు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం’ అని SMA బాధిత పసికందు గురించి సమయ్ రైనా అడ్డగోలుగా మాట్లాడాడు.

ఆ షోకు వెళ్లిన ఒక యువతిని ఉద్దేశించి.. “అమ్మా, మీరే చెప్పండి... ఒకవేళ మీరు ఆ తల్లి స్థానంలో ఉండి, మీకు రెండు నెలల పసికందు ఉండగా.. ఒకరోజు మీ బ్యాంకు ఖాతాలోకి రూ.16 కోట్లు వస్తే... మీరు కనీసం ఒక్కసారైనా మీ భర్త వైపు చూసి... 'హ్మ్... ద్రవ్యోల్బణం పెరుగుతోంది' అని అనరా?’’ అని సమయ్ రైనా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివాదం పెద్దది కావడంతో తన వ్యాఖ్యలపై సమయ్ రైనా సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పాడు.

క్యూర్ SMA ఫౌండేషన్ ఈ షోపై, సమయ్ రైనాపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. SMA బాధితులకు సాయంగా నిలవాలని సమయ్ రైనాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. SMA బాధితులకు అండగా నిలిచానని సమయ్ రైనా కోర్టుకు తప్పుడు వాంగ్మూలం ఇవ్వడంతో సుప్రీం కోర్టు సమయ్ రైనాపై కన్నెర్ర చేసింది. పది లక్షల జరిమానా విధించింది.