రైతులకు గుడ్ న్యూస్: నార్లాపూర్ ట్రయల్ రన్ సక్సెస్.. రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు

రైతులకు గుడ్ న్యూస్:  నార్లాపూర్ ట్రయల్ రన్  సక్సెస్..  రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు

నాగర్​కర్నూల్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని మొదటి లిఫ్ట్ నార్లాపూర్​పంప్​హౌస్ లో మొదటి పంప్​ వెట్ రన్ సక్సెస్ అయింది. మొదటి పంప్​ద్వారా వచ్చిన నీరు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి చేరింది. పంప్ ను నడిపించేందుకు ఇంజినీరింగ్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ​ఏజెన్సీ సిబ్బంది నాలుగు రోజులు శ్రమించారు. 

2023 సెప్టెంబర్​లో మోటార్ ను గంటపాటు నడిపించి నిలిపివేశారు. తాజాగా వెట్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు సోమవారం మోటార్ ను ఆన్ చేసేందుకు ప్రయత్నించారు. డ్రై రన్ లో 200 ఆర్పీఎం దాటిన పంప్ వెట్ రన్ కు వచ్చే సరికి ఆ స్థాయిని అందుకోలేదు.

 విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు మంగళవారం ఉదయం వాటిని సరిచేశారు. తర్వాత గంట పాటు మోటార్ ను నిడిపించడంతో నీరు నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి చేరింది. నీరు వచ్చే దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.

వారానికో పంప్ ను స్టార్ట్ చేస్తాం : ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి

వారానికి ఒక మోటార్ చొప్పున మాడు వారాల్లో మిగిలిన మోటార్ల డ్రై రన్ స్టార్ట్ చేస్తామని ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఈఈలు రవీందర్, లోకిలాల్ చెప్పారు. ప్రధాన కాల్వల పెండింగ్​పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపాలన్న సీఎం ఆదేశాల మేరకు పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.నార్లాపూర్​రిజర్వాయర్​నుంచి ఏర్పాటు చేసిన లింక్​ కెనాల్ ద్వారా నీటిని ఎల్లూరు రిజర్వాయర్​కు తరలించి మిషన్​భగీరథ అవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.