పేరెంట్స్ తిడతారన్న భయంతో...కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్..నారాయణపేట జిల్లాలో ఘటన

పేరెంట్స్ తిడతారన్న భయంతో...కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్..నారాయణపేట జిల్లాలో ఘటన
  • తీవ్ర గాయాలు, హాస్పిటల్ కు తరలింపు
  • నారాయణపేట జిల్లా పెదిరిపహాడ్ కేజీబీవీలో ఘటన

మద్దూరు, వెలుగు : పేరెంట్స్ తిడతారన్న భయంతో ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపహాడ్ శివారులోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... 

ఊట్కూర్ మండలానికి చెందిన ఓ బాలిక కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వల్లంపల్లికి చెందిన ఓ అనే యువకుడు సోమవారం కాలేజీకి వచ్చి బాలికను కలవాలని వాచ్ మెన్, నైట్ డ్యూటీ టీచర్ కు చెప్పాడు. పేరెంట్స్ తో మాట్లాడించాకే స్టూడెంట్ ను కలవాలని చెప్పడంతో ఆ యువకుడు ఫేక్ కాల్ చేశాడు. తర్వాత వెయిటింగ్ వస్తుందని సిబ్బందికి చెప్పి.. బాలికతో మాట్లాడి వెళ్లిపోయాడు. 

దీంతో అనుమానించిన టీచర్ బాలిక పేరెంట్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు బాలికతో మాట్లాడేందుకు మంగళవారం ఉదయం కాలేజీకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె 'అమ్మ, నాన్న, టీచర్లకు సారీ, నాకు చనిపోవాలని ఉంది' అని సూసైడ్ నోట్ రాసి బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి దూకేసింది. గమనించిన సిబ్బంది వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంఈవో జనార్దన్ రెడ్డి హాస్పిటల్ లో స్టూడెంట్ ను 
పరామర్శించారు.