మహిళల చేతికి ఎరువుల అమ్మకాలు..పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో 35 మహిళ సంఘాల ఎంపిక

మహిళల చేతికి ఎరువుల అమ్మకాలు..పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో 35 మహిళ సంఘాల ఎంపిక
  • ఆరు నెలల తాత్కాలిక లైసెన్స్ ల జారీకి కలెక్టర్ ఆదేశాలు

ఆదిలాబాద్, వెలుగు : గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం, రైతులకు యూరియా తిప్పలు తప్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో ఎరువుల అమ్మకాలు చేపట్టేందుకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కార్యాచరణ రూపొందించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద తాంసీ, తలమడుగు, భీంపూర్, గుడిహత్నూర్, మావల, ఇచ్చోడ, భోరజ్, జైనథ్, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో 35 స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. 

ఎరువుల అమ్మకాలకు సంబంధించి ఆయా సంఘాలకు ఆరు నెలల తాత్కాలిక లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది మహిళా సంఘాలు ఉన్నందున స్థానిక పరిస్థితులను బట్టి అర్హులైన గ్రూపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతు వేదికల వద్ద యూరియా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. యూరియా అమ్మకాల వల్ల రైతులకు స్థానికంగానే ఎరువులు దొరకడంతో పాటు, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. 

ఈ కేంద్రాల ద్వారా భవిష్యత్ లో క్రిమిసంహారక మందులు, విత్తనాల అమ్మకాలకు సైతం లైసెన్స్ లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతుల నుంచి రవాణా ఖర్చులను వసూలు చేసుకునే వెసులుబాటును మహిళా సంఘాలకు కల్పించారు. 

మార్క్‌‌ఫెడ్ ద్వారా ఎరువుల స్టాక్ కొనుగోలుకు సంఘాల వద్ద ఉన్న నిధులను వినియోగించుకోనున్నారు. విక్రయాలు, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్‌‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలనే విషయంపై మహిళలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. తాత్కాలికంగా రైతు వేదికల్లో అమ్మకాలు కొనసాగించి మరికొన్ని రోజుల్లో శాశ్వత భవనాలు, గోదాముల్లోకి మార్చనున్నారు.