- విచారించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పోలీస్ స్టేషన్ కోసం హక్కులను పరిశీలించకుండా భవనాన్ని అద్దెకు తీసుకున్న చర్లపల్లి ఎస్‌హెచ్‌ఓ తీరును హైకోర్టు తప్పుబట్టింది. భవన యజమాని అనుమతి లేకుండా ఉపలీజు ఇవ్వడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపలీజును తీసుకుని స్టేషన్ ఏర్పాటు చేయడం, భవనాన్ని ఖాళీ చేయడంపై యజమాని ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలంటూ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇంటిని ఖాళీ చేయించాలంటూ డీజీపీకి ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ తిరుమల లక్ష్మణాచార్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలోని ఈసీనగర్‌లో 240 చదరపు గజాల్లో ఉన్న రెండంతస్తుల భవనాన్ని చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీకి నెలకు రూ.36 వేల అద్దెతో లీజుకు ఇచ్చారని తెలిపారు.
అయితే, సొసైటీ ఈ ఇంటిని పోలీస్ స్టేషన్ నిర్వహణ నిమిత్తం ఉపలీజుకు ఇచ్చారన్నారు. ఉపలీజుకు ఇవ్వడానికి పిటిషనర్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. అద్దె చెల్లించడంలేదని, ఇంటిని ఖాళీ చేయడంలేదని తెలిపారు. అందులో పోలీస్ స్టేషన్ నిర్వహిస్తుండటంతో ఖాళీ చేయాలని పోలీసులను అడగాలంటే యజమాని భయపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై డీజీపీకి ఫిబ్రవరిలో వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చిలో రూ.2.16 లక్షలు, 1.08 లక్షలు చొప్పున రెండు విడతల్లో ఇంటి యజమాని బకాయిలు మొత్తం చెల్లించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆస్తిపై పిటిషనర్‌కు హక్కులున్నాయని, 2023లో అద్దె ఒప్పందం కుదుర్చుకుంటూ 11 నెలలపాటు చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీతో అద్దె ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
ప్రస్తుతం అద్దె ఒప్పందం కాలపరిమితి కూడా ముగిసిపోయిందన్నారు. యజమాని అనుమతి లేకుండా సొసైటీ ఉపలీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. హక్కులను పరిశీలించకుండా చర్లపల్లి ఎస్‌హెచ్‌వో ఉపలీజుకు తీసుకోవడం చెల్లదని, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నిర్వహణ ఆక్రమణ కిందికే వస్తుందన్నారు. పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.
