లులు మాల్లో గన్ కలకలం.. పార్కింగ్ విషయంలో రెండు ఫ్యామిలీల మధ్య ఘర్షణ

లులు మాల్లో గన్ కలకలం.. పార్కింగ్ విషయంలో రెండు ఫ్యామిలీల మధ్య ఘర్షణ
  • గన్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • మాల్​ నిర్వాహకులపై కేసు నమోదు

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీలోని లులు మాల్​లోకి వచ్చిన ఓ వ్యక్తి వద్ద గన్  దొరకడం కలకలం రేపింది. పార్కింగ్​ విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో అనూహ్యంగా గన్​ ఉన్నట్లు తేలింది. సాధారణ గొడవగా భావించి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గన్​ను గుర్తించి షాకయ్యారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల కింద ఓల్డ్​ సిటీకి చెందిన సిద్ధిఖీ కుటుంబంతో కలిసి కేపీహెచ్​బీ కాలనీలోని లులు మాల్​కు వచ్చాడు. అతను కారు పార్క్​ చేసే విషయంలో మరో కుటుంబంతో వాగ్వాదం జరిగింది. 

ఘర్షణకు దారి తీస్తుండడంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుల్స్​ ఇరువర్గాలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో సిద్ధిఖీ జేబులో గన్​ ఉండడంతో దానిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని స్టేషన్​కు తరలించారు. 

పోలీసుల విచారణలో సిద్ధిఖీ వద్ద ఉన్నది లైసెన్స్​డ్​ గన్​ అని తేలినట్లు తెలిసింది. ఘర్షణ సమయంలో గన్​ బయటకు తీయకపోవడంతో పోలీసులు గన్​ను మాత్రమే స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. సిద్ధిఖీ బంజారాహిల్స్​లోని తెలంగాణ రైఫిల్స్​ అకాడమీలో స్పోర్ట్స్​ షూటర్​గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే గన్​తో మాల్​లోకి ప్రవేశించినా, ఎవరూ గమనించకపోవడం మాల్​ నిర్వాహకుల భద్రతా వైఫల్యంగా భావించిన పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.