గండిపేట, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని చనిపోగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ అంస్రీ సెంట్రల్ కోర్ట్ కు చెందిన అద్దంకి అమూల్య(21) సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీలో చదువుతోంది.
సోమవారం అర్ధరాత్రి అమూల్య తన స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి కారులో శంషాబాద్ చూడడానికి బయలుదేరింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన వారు రోడ్ తెలియక పెద్ద అంబర్‌పేట్ వైపు వెళ్లే రహదారిపైకి వచ్చారు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ టోల్‌గేట్ వద్ద అమూల్య నడుపుతున్న కారు అదుపు తప్పి రోడ్డుకు కుడి వైపు ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
కారు గాల్లోకి ఎగిరి అవతలి వైపు బోల్తా పడింది. కారు నడుపుతున్న అమూల్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. పక్క సీట్లో కూర్చున్న సిద్ధార్థ్‌కు తీవ్రగాయాలవగా, స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
