జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు:  తెలంగాణలో అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా, జర్నలిస్టుల పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సెక్రటేరియేట్​లో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితా రాణాను టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, తమ పిల్లలను కార్పొరేట్ సంస్థల్లో చదివించుకోలేకపోతున్నారని సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉచిత విద్యపై ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని, రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రత్యేక సీట్ల కోటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని యోగితా రాణా హామీ ఇచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచెం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వి. రవికుమార్ పాల్గొన్నారు