ఆషాఢం మొదలైంది. హైదరాబాద్ లో బోనాల సందడి ప్రారంభమైంది. రేపు ( జులై 16) గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల పండుగతో కొన్ని చోట్ల ప్రాంతీయ ఆచారాల ప్రకారం ... గ్రామ దేవతలను... కుల దేవతలను పూజిస్తారు. అసలెందుకుఈ పండుగ చేస్తారంటే.. మన సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకని అమ్మవారికి నచ్చిన భోజనం, చీర, సారెలు సమర్పిస్తారు.
భాగ్యనగరం ఆషాఢ మాస ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలకు సర్వం సిద్ధమైంది.. పేరుకు ప్రాంతీయ పండుగలే కానీ, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా జరుపుకునే గొప్ప వేడుక. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు కూడా తమ సంస్కృతీ సంప్రదాయాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
బోనం అంటే ఏమిటి..
భోజనం అనే పదానికి వికృతి బోనం. బోనాల పండుగ తెలంగాణలోచాలా ఘనంగా జరుపుకునే ఉత్సవం. రాయలసీమలోనూ కొన్నిప్రాంతాల్లో బోనాలు జరుపుకుంటారు. తెలంగాణలో మాత్రం ఈ వేడుకలను ‘ఆషాఢ బోనాల పండుగ’ అని కూడా పిలుస్తారు.
ఎలా జరుపుకుంటారు?
బోనాల జాతర జరిగే రోజు భక్తులు తలస్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని ఆలయానికి వెళ్తారు. అక్కడే పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదం తయారుచేస్తారు. తర్వాత ఆ కుండపై మరో కుండ పెట్టి అందులో దీపం పెట్టి చుట్టూ వేపాకులతో అలంకరిస్తారు. ఆ కుండలను తలమీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు.
దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరిస్తారు. అయితే ఆలయంలో బోనం వండే వీలులేని వాళ్లు అమ్మవారికి ఒడిబియ్యాన్ని కూడా సమర్పించొచ్చు. ఇకపోతే.. బోనాల సందర్భంగా తమకు కష్టాలు తీరినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్లు, మేకలు బలి కూడా ఇస్తుంటారు.
తొలి బోనం..
ఆషాఢ మాసం మొదలుతో గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. ప్రతాప రుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారట. ఆనాటి నుంచి హైదరాబాద్లో గోల్కొండ లోని అతి పురాతనమైన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తడం సంప్రదాయంగా వస్తోంది.
బోనాల పండుగ ప్రత్యేకతలు ఇవే..!
ఈ వేడుకల్లో పోతురాజు చేసే విన్యాసాలు ఆశ్చర్యపరుస్తాయి. అలాగే భవిష్యవాణి చెప్పే ఘట్టం కూడా ఈ వేడుకలో ముఖ్యమైనది. అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా భవిష్యవాణి వినిపిస్తుంది. అందులో భాగంగా వర్షాలు ఎలా కురుస్తాయి? ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియజేస్తారు.
అంతేకాదు.. బోనాలతో ఆలయానికి వెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని భక్తులు నమ్ముతారు. వాళ్లు నడిచి వెళ్తున్నప్పుడు కొందరు భక్తులు వాళ్ల పాదాలను నీళ్లతో కడిగి అమ్మవారికి సమర్పించే పాద్యంగా భావిస్తారు. బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయడాన్ని ‘వడి’ అంటారు. ఆలయం వెళ్లిన వాళ్లంతా అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దాన్ని ‘సాక’ అంటారు. సంతానం కలగాలని, బాలారిష్టాలు తొలగాలని అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఊయల సమర్పించడాన్ని ‘తొట్టెలు’ అంటారు. పండుగ తర్వాత అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించడాన్ని ‘సాగనంపడం’ అంటారు.
