Global Cricket: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ క్రికెట్ రూపురేఖలను మార్చేలనే సంచలన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎడిన్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో క్రికెట్‌లోని 3 ప్రధాన ఫార్మాట్ల పురుషుల సీనియర్ టోర్నమెంట్ల రూపాన్ని మార్చడంపై విస్తృతంగా చర్చించారు. న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రీడాకారుడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ వర్కింగ్ గ్రూప్ ఈ విప్లవాత్మక సిఫార్సులు చేసింది. ఈ కొత్త ప్రణాళికలు అమలైతే భవిష్యత్తులో మనం చూసే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా మారే ఛాన్స్ ఉంది.
2027 వన్డే ప్రపంచకప్:
వచ్చే ఏడాది (2027) దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఒక ఊహించని మార్పు వచ్చే అవకాశం ఉంది. గత 2019, 2023 ప్రపంచకప్‌లలో కేవలం 10 జట్లే పాల్గొనగా, ఈసారి దీనిని 14 జట్ల టోర్నీగా విస్తరించాలని ఐసీసీ మొదట ప్లాన్ చేసింది. కానీ, తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రతిష్టాత్మక టోర్నీని 12 జట్లకు పరిమితం చేయాలని ఐసీసీ యోచిస్తోంది. కొత్త ఫార్మాట్ ప్రకారం.. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత సూపర్ 7 రౌండ్‌ను ప్రవేశపెట్టి, రెండు గ్రూపుల నుంచి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు నాలుగో స్థానంలో ఉన్న అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టును సెలక్ట్ చేస్తారు.
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 10:
ప్రస్తుతం 20 జట్లతో అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా సరికొత్త మార్పు రానుంది. లీగ్ దశలో మ్యాచ్‌ల ఉత్కంఠను మరింత పెంచేందుకు సూపర్ 8 రౌండ్ స్థానంలో సూపర్ 10 దశను తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం మొత్తం 20 టీమ్స్ ని ఐదు గ్రూపులుగా విభజిస్తారు (ప్రతి గ్రూప్‌లో కేవలం నాలుగు జట్లు మాత్రమే ఉంటాయి). ఆయా గ్రూపుల నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి రెండు జట్లు నేరుగా తదుపరి రౌండ్ అయిన సూపర్ 10కి అర్హత సాధిస్తాయి. దీనివల్ల ఎలాంటి ప్రాధాన్యత లేని డెడ్-రబ్బర్ మ్యాచ్‌లు పూర్తిగా తగ్గిపోయి ప్రతి మ్యాచ్ గ్రూప్ దశ నుంచే అత్యంత కీలకంగా మారుతుంది.
►ALSO READ | హ్యాండిచ్చిన రోహిత్, కోహ్లీ.. భారత్కి మైండ్ బ్లాకింగ్ షాక్!
WTC లో సెమీఫైనల్స్.. క్లబ్ టీ20 లీగ్:
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) కేవలం రెండు సంవత్సరాల సుదీర్ఘ లీగ్ తర్వాత ఒకే ఒక ఫైనల్ మ్యాచ్‌తో ముగియకుండా, ఇకపై సెమీఫైనల్స్ కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు. దీని వల్ల లీగ్ దశ చివర్లో ప్రతి టెస్ట్ సిరీస్ జట్ల మధ్య అత్యంత కీలకంగా మారి పోటీని రెట్టింపు చేస్తుంది. వీటితో పాటు ఫుట్‌బాల్‌లోని ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ తరహాలోనే వరల్డ్ కప్ టీ20 పేరుతో ఒక సరికొత్త గ్లోబల్ క్లబ్ టోర్నమెంట్‌ను ప్రారంభించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఫ్రాంచైజీ జట్లు (ఐపీఎల్, ఎస్‌ఏ20 వంటివి) ఒకే వేదికపై తలపడే ఛాన్స్ ఉంటుంది.
ఈ సరికొత్త ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నప్పటికీ, వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే క్రికెట్ ప్రపంచంలో ఒక నూతన శకం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఫ్రాంచైజీ క్లబ్ టోర్నీ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మునుపెన్నడూ లేని సరికొత్త వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తుంది.
