భారత్-యూకే డీల్ అమల్లోకి..కార్లు, చాక్లెట్లు, బిస్కెట్లు చౌక.. భారత వస్తువులకు బ్రిటన్ మార్కెట్ ఓపెన్!

భారత్-యూకే డీల్ అమల్లోకి..కార్లు, చాక్లెట్లు, బిస్కెట్లు చౌక.. భారత వస్తువులకు బ్రిటన్ మార్కెట్ ఓపెన్!
  • 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు  చేరాలని లక్ష్యం   
  • తగ్గనున్న చాక్లెట్, బిస్కెట్లు, కాస్మోటిక్స్ దిగుమతి సుంకాలు 
  • జీరో  టారిఫ్ తో యూకే మార్కెట్లోకి బట్టలు, చెప్పులు, రత్నాలు, ప్లాస్టిక్ వస్తువులు 

భారత్, యూకే మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇవాళ్టి(జూలై 15)నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందంతో భారతీయ వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులు యూకే మార్కెట్‌లోకి తక్కువ లేదా సున్నా సుంకాలతో వెళ్లనున్నాయి. దీంతో భారతీయ కంపెనీలకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులు భారత్‌లో చౌకగా లభించనున్నాయి. స్కాచ్ విస్కీపై ఉన్న 150 శాతం దిగుమతి సుంకం క్రమంగా 40 శాతానికి తగ్గనుంది. అలాగే బ్రిటిష్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, యంత్ర పరికరాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం వల్ల వస్త్ర పరిశ్రమ, తోలు పరిశ్రమ, సముద్ర ఆహార రంగం, ఆటో విడిభాగాలు, రసాయనాలు, రత్నాలు-ఆభరణాల రంగాలకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. అయితే రైతులు, పాడి పరిశ్రమను రక్షించేందుకు పాలు, చక్కెర, బియ్యం వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఒప్పందం నుంచి మినహాయించారు.