ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మళ్లీ 60 రోజుల యుద్ధం!..యూఎస్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీస్ ఇచ్చిన ట్రంప్

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మళ్లీ 60 రోజుల యుద్ధం!..యూఎస్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీస్ ఇచ్చిన ట్రంప్
  • యూఎస్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీస్ ఇచ్చిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ​ట్రంప్ 
  • చట్టసభల అనుమతి లేకుండా మరోసారి సైనిక చర్య కొనసాగించేలా వ్యూహం
  • హార్మూజ్​లో నౌకలపై 20%  టోల్​ ఫీజు నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు వెల్లడి
  • వరుసగా మూడోరోజు అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు 
  • హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయిల్ ట్యాంకర్​పై అటాక్​.. మరో భారతీయుడు మృతి 
  • ఇరాన్ రాయబారికి కేంద్రం నోటీసులు.. జలసంధిలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు


టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌‌‌‌‌పై మరోసారి 60 రోజులపాటు యుద్ధానికి సిద్ధమైనట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఆయన ఈ మేరకు అధికారికంగా నోటీస్ పంపారని ‘పొలిటికో’ మీడియా సంస్థ మంగళవారం వెల్లడించింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు జులై 10వ తేదీనే ట్రంప్ ఈ నోటీస్ ఇచ్చారని, తద్వారా చట్టసభ ఆమోదం లేకుండానే పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక చర్య కొనసాగించేందుకు ఆయన ప్రభుత్వానికి మరో 60 రోజుల గడువు లభించిందని తెలిపింది.

 ‘‘యునైటెడ్ స్టేట్స్ లేదా దాని మిత్రదేశాలు, భాగస్వాములపై వచ్చే మరిన్ని బెదిరింపులు, దాడులను ఎదుర్కోవడానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడానికి అమెరికా సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు, మన మిత్రదేశాలకు, భాగస్వాములకు ముప్పుగా మారకుండా ఉండేలా చూసేందుకు దళాలు సన్నద్ధంగా ఉంటాయి” అని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాసిన లేఖ(నోటీస్)లో ట్రంప్ పేర్కొన్నారని వివరించింది. కాగా, ఇరాన్‌‌‌‌‌‌‌‌తో రెండు నెలల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ ప్రకటించిన తర్వాత చట్టసభ సభ్యులకు ఈ నోటీసు అందింది.

కొనసాగిన దాడులు.. ప్రతిదాడులు

అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో ఆ దేశవ్యాప్తంగా ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీశామని యూఎస్​ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా దళాలు ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ కేంద్రాలపై దాడులు చేశాయని తెలిపింది.

 అమెరికా దాడులకు ప్రతీకారంగా మంగళవారం ఉదయం హార్మూజ్ జలసంధిలో రెండు యూఏఈ చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో పాటు యూఏఈ, బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులు చేసింది.ఒమన్ తీరంలో ‘స్టోల్ట్ మెగ్నీషియం’ అనే నౌకపై జరిగిన దాడిలో అది పేలుడుకు గురైందని, దాని ఇంజన్ గదిలో మంటలు చెలరేగాయని రాయిటర్స్ పేర్కొంది.

నిలిచిన షిప్పింగ్.. పెరిగిన క్రూడాయిల్ ధరలు 

హార్మూజ్ గుండా రవాణా మళ్లీ నెమ్మదించింది. క్లెపర్ సంస్థ సమాచారం ప్రకారం.. జులై 10 నుంచి 12 వరకు నౌకల రాకపోకలు సుమారు 52 శాతం తగ్గాయి. నౌకలు మరింత రక్షణాత్మక మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఒమన్, అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (ఐఎంవో) ఆమోదించిన మార్గాలను కాకుండా ఇరానియన్ లేదా రహస్య (డార్క్) మార్గాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో మంగళవారం బ్రెంట్ ముడిచమురు ధర 2% పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 85 డాలర్లకు చేరుకుంది. కాగా, పశ్చిమాసియాలో ముదురుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ సహా గల్ఫ్ దేశాల గగనతలంతో పాటు ఒమన్ గల్ఫ్ జలాలపై విమానాలను నడపవద్దని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) మంగళవారం విమానయాన సంస్థలను హెచ్చరించింది.

మరో నావికుడి మృతి.. ఇరాన్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం సమన్లు 

మంగళవారం హార్మూజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు జరిపిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించగా, ఆరుగురు భారతీయ పౌరులతో సహా ఎనిమిది మంది నావికులు గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చమురు ట్యాంకర్లయిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ ఒమన్ ప్రాదేశిక జలాల పరిధిలోని హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా ఇరాన్ రెండు క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. కాగా, ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హుస్సేనీకి విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

హార్మూజ్ ఎప్పటికీ తెరుచుకోదు: ఇరాన్

అమెరికా యుద్ధం వల్ల హార్మూజ్ ఎప్పటికీ తెరుచుకోదని ఇరాన్ స్పష్టం చేసింది. వ్యూహాత్మక జలమార్గంపై అమెరికా తెస్తున్న ఒత్తిడిని తిరస్కరిస్తూ, యుద్ధం, దురాక్రమణ ద్వారా హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. హార్మూజ్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గేదేలేదని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమీనియా నొక్కి చెప్పారు. కాగా, హార్మూజ్ జలసంధి భద్రత, నిర్వహణపై ఇరాన్ పార్లమెంట్ అధికారికంగా బిల్లును ప్రవేశపెట్టిందని జాతీయ భద్రతా కమిటీ అధిపతి, ఎంపీ ఇబ్రహీం అజీజీ తెలిపారు.

హార్మూజ్‌‌లో 20% టోల్‌‌ ఫీజుపై వెనక్కి

హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణా నౌకలపై 20% టోల్ ఛార్జీలు విధించాలనే తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ‘‘పశ్చిమాసియా నాయకత్వంతో జరిపిన అత్యంత ఫలప్రదమైన చర్చల ఆధారంగా, హార్మూజ్ జలసంధిపై విధించాలనుకున్న 20 శాతం అమెరికా రీయింబర్స్‌‌మెంట్ ఫీజు ప్రతిపాదనను విరమించుకుంటున్నా. దానికి బదులుగా వివిధ గల్ఫ్ దేశాలు అమెరికాలో చేయబోయే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో రాశారు. 

ఈ పెట్టుబడులు అత్యంత భారీ స్థాయిలో ఉంటాయని, ఈ ఒప్పందాలు పశ్చిమాసియా దేశాలకు, వాటి భవిష్యత్తుకు అసాధారణ రీతిలో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, అమెరికా సైన్యం అద్భుతమైన శక్తి సామర్థ్యాల కారణంగా చమురు సరఫరా మునుపెన్నడూ లేని విధంగా సాగుతోందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ మినహా మిగిలిన అన్ని దేశాల నౌకల రాకపోకలకు హార్మూజ్ తెరిచే ఉందని స్పష్టం చేశారు. 

ఇరాన్ ఓడరేవులకు వచ్చే, వెళ్లే నౌకలపై లేదా ఇరాన్ సరుకుకు సంబంధించిన వేటినైనా రవాణా చేసే నౌకలపైనే తాము పూర్తి దిగ్బంధనం విధిస్తామని ప్రకటించారు. ఇరాన్ దేశం 52 వేల మంది నిరసనకారులు సహా లక్షలాది మంది ప్రజలను చంపించే రోజులు పోయాయని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని సాధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు.