టోక్యో : టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్-750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై 21–-14, 21–-11తో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
మరోవైపు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి భుజం గాయం తిరగబెట్టడంతో చిరాగ్ శెట్టితో కలిసి తొలి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. డెన్మార్క్ జోడీతో తొలి గేమ్‌ను 19-–21తో కోల్పోయిన తర్వాత మ్యాచ్‌ను కొనసాగించలేదు. ఈ గాయం కారణంగా వచ్చే వారం జరిగే చైనా ఓపెన్‌కు కూడా దూరంగా ఉండనున్నట్లు భారత డబుల్స్ ప్రధాన కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిలా-తనిషా క్రాస్టో జోడీ రెండో రౌండ్‌కు చేరగా, రోహన్ కపూర్-రుత్విక శివాని గడ్డె జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
