- మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ఘనంగా ప్రారంభం
- నెలకు ఒకరోజు గర్ల్స్ హాస్టళ్లలో బస చేయనున్న మహిళా పోలీసులు
- సమస్యల పరిష్కారం, చట్టాలు, భద్రతలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
మెదక్/సూర్యాపేట, వెలుగు : విద్యార్థినుల భద్రతకు భరోసానిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ‘పోలీస్ అక్క’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థినుల్లో రక్షణ భావాన్ని పెంపొందించడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, మహిళల రక్షణపై అవగాహన కల్పించడ, స్నేహపూర్వక పోలీస్ సేవలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ వినూత్న కార్యక్రమాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తమ జిల్లాల్లో అధికారికంగా ప్రారంభించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఒక మహిళా కానిస్టేబుల్‌ను ‘పోలీస్ అక్క’గా నియమించి ఈ బాధ్యతలను అప్పగించారు.
సొంత అక్కతో పంచుకున్నట్లు..
పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి విద్యార్థినులు భయపడకుండా, తమ సొంత అక్కతో పంచుకున్నట్లుగా స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను చెప్పుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ బృందంలోని మహిళా పోలీసులు క్రమం తప్పకుండా తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను సందర్శిస్తారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేయడం, ఉదయం యోగా, వ్యాయామాలు నిర్వహించడం, అంతేకాకుండా నెలలో ఒకరోజు గర్ల్స్ హాస్టళ్లలోనే బస చేసి రాత్రి వేళ వారిలో ధైర్యం నింపడం వంటి పనులను చేపడతారు.
సమగ్ర అవగాహన..
ఈ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలు, సోషల్ మీడియా సురక్షిత వినియోగం, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, పోక్సో చట్టాలు, మహిళల రక్షణ చట్టాల గురించి వివరిస్తూ వారి హక్కులను తెలియజేస్తారు. చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా విద్యార్థినులకు ప్రేరణాత్మక మార్గదర్శకత్వం కూడా అందిస్తారు.
డయల్ 100 లేదా 112
విద్యార్థినులు, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా ‘పోలీస్ అక్క’ను సంప్రదించాలని ఎస్పీలు పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వెంటనే న్యాయపరమైన, పోలీస్ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని, ఆపద సమయంలో డయల్ 100 లేదా 112 ను సంప్రదించాలని సూచించారు.
